Page Loader
Hyderabad Metro: ఫ్యూచర్ సిటీకి మూడు వినూత్న మార్గాల్లో మెట్రో సేవలు.. 40 నిమిషాలే ప్రయాణం..
ఫ్యూచర్ సిటీకి మూడు వినూత్న మార్గాల్లో మెట్రో సేవలు.. 40 నిమిషాలే ప్రయాణం..

Hyderabad Metro: ఫ్యూచర్ సిటీకి మూడు వినూత్న మార్గాల్లో మెట్రో సేవలు.. 40 నిమిషాలే ప్రయాణం..

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 24, 2025
10:37 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌ల తరువాత నాలుగో అతిపెద్ద నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ఫ్యూచర్ సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యావరణ హిత 'గ్రీన్ సిటీ'గా తీర్చిదిద్దేందుకు వ్యూహాత్మక ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు మెట్రో రైల్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

వివరాలు 

మెట్రో మార్గంపై ప్రణాళికలు 

ఫ్యూచర్ సిటీకి మెట్రో కనెక్షన్‌ను అందించేందుకు మూడు విభిన్న మార్గాల ద్వారా సేవలను అందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అండర్‌గ్రౌండ్, ఎలివేటెడ్, ఎట్-గ్రేడ్ మార్గాల్లో మెట్రోను నిర్మించనున్నారు. భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధానాన్ని అనుసరించనున్నారు. 18 కిలోమీటర్ల 'ఎట్ గ్రేడ్' మార్గం: రావిర్యాల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి స్కిల్ యూనివర్శిటీ వరకు మెట్రో సేవలు భూమి మట్టంలోనే (ఎట్ గ్రేడ్) అందుబాటులోకి రానున్నాయి. 2 కిలోమీటర్ల అండర్‌గ్రౌండ్ మెట్రో: శంషాబాద్ ఎయిర్ పోర్టులో రెండు కిలోమీటర్ల మేర భూగర్భ మెట్రో ఏర్పాటు చేయనున్నారు. 6 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్: అండర్‌గ్రౌండ్ మార్గం తరువాత 6 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్ రూపంలో మెట్రో కొనసాగుతుంది.

వివరాలు 

40 కిలోమీటర్లు - 40 నిమిషాల్లో ప్రయాణం 

14 కిలోమీటర్ల తక్కువ ఎత్తులో ఎలివేటెడ్ మార్గం:పెద్దగోల్కొండ నుంచి ఓఆర్ఆర్ వెంట 14 కిలోమీటర్ల పాటు తక్కువ ఎత్తులో ఎలివేటెడ్ కారిడార్ రూపంలో నిర్మాణం జరపనున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి ఫ్యూచర్ సిటీకి 40కిలోమీటర్ల దూరాన్ని కేవలం 40 నిమిషాల్లో చేరుకునేలా మెట్రో కారిడార్ రూపకల్పన చేస్తున్నారు. పర్యావరణ కాలుష్యం లేకుండా పొల్యూషన్-ఫ్రీ గ్రీన్ సిటీగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం. ఈ ప్రాజెక్ట్‌ కోసం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్,హెచ్ఎండీఏ,టీజీఐఐసీలు కలిసి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి. మార్చి నెలాఖరుకు ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ డీపీఆర్ పూర్తిచేసి,రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తీసుకుని,ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.