చరిత్ర సృష్టించిన హైదరాబాద్ మెట్రో.. ఒక్క రోజే 5.10 లక్షల మంది ప్రయాణం
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ మెట్రో రైలు చరిత్ర సృష్టించింది. సోమవారం ఒక్క రోజే 5.10 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. ఈ మేరకు ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది.
3 కారిడార్లు కలిపి 69 కిలోమీటర్ల మేర మెట్రో సేవలు కొనసాగుతున్నాయి. 2017 నవంబరు 29న హైదరాబాద్ మెట్రో ప్రారంభమైంది. మెట్రో రైలు ప్రారంభించిన మొదటి రోజే 2 లక్షలకుపైగా ప్రయాణించారు.
కోవిడ్ కాలం తర్వాత మెట్రోలో ప్రయాణికుల రద్దీ క్రమంగా పుంజుకుంటూ తాజాగా పతాక స్థాయికి చేరుకుంది. మెట్రో సేవలతో నగరవాసులు ట్రాఫిక్ వలలో చిక్కుకోకుండా, క్షేమంగా, వేగంగా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.
అయితే ప్రస్తుతం ప్రతిరోజూ సగటున దాదాపుగా 4.40 లక్షల మంది ఈ ఆధునిక రవాణా సేవలను వినియోగిస్తున్నారు.
DETAILS
మెట్రో చరిత్రలోనే ఇదో చారిత్రక మైలురాయి : ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్
హైదరాబాద్ మెట్రో చరిత్రలోనే ఇదో చారిత్రక మైలురాయి అని ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్ ప్రకటించింది. ప్రయాణికుల నమ్మకానికి ఇదే నిదర్శనమని పేర్కొంది.
మెట్రో రైలు ప్రారంభం తర్వాత ఒక్క రోజు 5 లక్షల మందికిపైగా ప్రయాణించడం ఇదే మొదటిసారని ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి వెల్లడించారు.
కోవిడ్ పరిస్థితుల్లో రైలు నిర్వహణ, వ్యాపారంపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు. అయితే అధికారులు, సిబ్బంది కృషి వల్లే ఈ విజయాన్ని చూడగలుగుతున్నామని పేర్కొన్నారు.
మరోవైపు కారిడార్-1లో మియాపూర్ ఎల్‌బీనగర్ మార్గంలో ఒక్కరోజే అత్యధికంగా 2.60 లక్షల మంది ప్రయాణించారని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రాయదుర్గం స్టేషన్ నుంచే 32 వేల మంది ప్రయాణించారన్నారు.