miss world pageant: హైదరాబాద్‌లో ప్రపంచ సుందరి పోటీలు - మే 4 నుంచి 31 వరకు గ్రాండ్ ఈవెంట్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్) పోటీలు హైదరాబాద్‌లో జరగనున్నాయి.
మే 4 నుంచి 31 వరకు నిర్వహించే ఈ పోటీల్లో ప్రారంభ వేడుకలు, గ్రాండ్ ఫినాలే సహా ఇతర ముఖ్యమైన ఈవెంట్లు నగరంలో జరుగనున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో అనుబంధ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.
ఈ విషయాన్ని పోటీ నిర్వహకులు బుధవారం ప్రకటించారు. మొత్తం 140 దేశాల నుంచి అందమైన యువతులు ఈ పోటీలో పాల్గొనబోతున్నారు.
వివరాలు
భారతదేశంలో మూడోసారి - హైదరాబాద్‌కు అరుదైన గౌరవం
భారతదేశంలో మిస్ వరల్డ్ పోటీలు 1996, 2024లలో జరిగినప్పటికీ, మూడోసారి నిర్వహణ హక్కు తెలంగాణకు దక్కడం విశేషం.
2024లో ముంబయిలో జరిగిన 71వ ప్రపంచ సుందరి పోటీలు విజయవంతంగా ముగిశాయి.
72వ ఎడిషన్ కోసం దుబాయ్‌తో కఠినమైన పోటీ నెలకొన్నప్పటికీ, హైదరాబాద్‌కు ఉన్న అంతర్జాతీయ గుర్తింపు, చారిత్రక ప్రాముఖ్యత, గ్రామీణ ప్రాంతాల ప్రత్యేకతలు వంటి అంశాల కారణంగా ఈ అవకాశం లభించింది.
వివరాలు
తెలంగాణ - అంతర్జాతీయ పోటీలకు అనువైన ప్రదేశం
గత పదేళ్లుగా వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ, ఇప్పుడు ప్రపంచ అందాల పోటీలకు వేదికగా మారుతోంది.
ఆధునిక మౌలిక సదుపాయాలు, ప్రపంచస్థాయి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు, ఆహ్లాదకరమైన వాతావరణం వంటి అనేక అంశాలు ఈ పోటీలను ఇక్కడ నిర్వహించేందుకు అనుకూలంగా నిలిచాయి.
అంతేగాక, తెలంగాణ గ్లోబల్ ఫార్మాస్యూటికల్ హబ్‌గా కూడా గుర్తింపు పొందింది. మిస్ వరల్డ్ లిమిటెడ్ ఛైర్‌పర్సన్ & సీఈవో జూలియా మోర్లీ, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్‌తో కలిసి ఒక ప్రకటనలో ఈ పోటీల నిర్వహణ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.
వివరాలు
8 నుంచి 9 ఈవెంట్లు..
ఈ పోటీల్లో మొత్తం 8 నుంచి 9 విభిన్నఈవెంట్లు ఉంటాయని సమాచారం.లండన్ కేంద్రంగా ఉన్న మిస్ వరల్డ్ సంస్థ,తెలంగాణ పర్యాటక శాఖతో కలిసి ఈ పోటీలను నిర్వహించనుంది.
ఈ కార్యక్రమాల కోసం రాష్ట్రంలోని 10 ప్రదేశాలను ప్రాథమికంగా గుర్తించారు.హైదరాబాద్‌లోని హైటెక్స్,శిల్పారామం,గచ్చిబౌలి స్టేడియం ప్రధాన వేదికలుగా ఉండే అవకాశముంది.
అలాగే,రామప్ప ఆలయం,యాదాద్రి,లక్నవరం, అనంతగిరి వంటి ప్రదేశాల్లో కొన్ని ఈవెంట్లు జరగనున్నాయి.
ప్రపంచ సుందరి పోటీలు ప్రత్యేక థీమ్‌లతో రూపొందించబోతున్నాయి, తద్వారా తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి ప్రదర్శించే అవకాశం లభిస్తుంది.
ఈ ఈవెంట్ల ఖరారు మరో మూడు, నాలుగు రోజుల్లో జరుగుతుందని, ఫిబ్రవరి 27న మిస్ వరల్డ్ నిర్వాహకులు, పర్యాటక శాఖ కలిసి నిర్వహించే విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడిస్తారని సమాచారం.