అమెరికాలో దోపిడీకి గురైన భారత విద్యార్థిని.. ఇండియాకు రప్పించాలని కేంద్రాన్ని వేడుకున్న తల్లి
భారతదేశానికి చెందిన ఓ విద్యార్థిని అగ్రరాజ్యం అమెరికాలో ఆకలితో అలమటిస్తున్నారు. ఈ విషయం తెలిసిన బాధిత తల్లి, వెంటనే తమ కుమార్తెను స్వదేశం రప్పించాలని విదేశీ వ్యవహారాల శాఖకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు చెందిన ఓ యువతి పస్తులుంటూ అమెరికాలో వేదన అనుభవిస్తున్నారు. మాస్టర్స్(MS) చేసేందుకు కొండంత ఆశతో అమెరికాకు పయనమైన ఆమె షికాగో రోడ్ల మీద తిప్పలు పడుతున్నారు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి తమ కుమార్తెను భారత్‌కు తీసుకురావాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్‌కు విజ్ఞప్తి చేశారు. సదరు లేఖను బీఆర్ఎస్ నేత ఖలీకర్ రెహమాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
మాస్టర్స్ కోసం అమెరికా తరలివెళ్లిన సయ్యదా లులు మిన్హాజ్ జైదీ
హైదరాబాద్ నగరంలోని మౌలాలికి చెందిన సయ్యదా లులు మిన్హాజ్ జైదీ మాస్టర్స్(MASTER OF SCIENCE) కోర్సు చేసేందుకు 2021 ఆగస్టులో అమెరికాలో అడుగుపెట్టారు. యూఎస్ వెళ్లాక ఆమె తరచుగా తల్లి సయ్యదా వహాజ్ ఫాతిమాతో ఫోన్ ద్వారా యోగ క్షేమాలు తెలిపేది.ఈ క్రమంలోనే గత రెండు నెలలుగా కూతురు నుంచి తల్లికి ఎటువంటి సమాచారం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లిన కొందరు తెలిసిన వ్యక్తులు బాధితురాలిని గుర్తించారు. అనంతరం ఆమె తాజా పరిస్థితిని ఆమె తల్లి దృష్టికి తీసుకెళ్లారు. అగ్రదేశంలో తన వస్తువులను ఎవరో ఎత్తుకెళ్లారని, ఈ కారణంగానే చికాగో రోడ్లపై ఆకలితో అలమటిస్తున్నట్లు గుర్తించారు.మరోవైపు లులు మిన్హాజ్ మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు వారు అంచనాకు వచ్చారు.
రెండు నెలలుగా ఆమెతో ఫోన్ సంప్రదింపులు ఆగిపోయాయి : బాధిత తల్లి
దీంతో తల్లడిల్లిన బాధిత తల్లి, తన కుమార్తె సయ్యదా లులు మిన్హాజ్ జైదీ అమెరికాకు మాస్టర్స్ నిమిత్తం వెళ్లిందని, రెండు నెలలుగా ఆమెతో ఫోన్ సంప్రదింపులు ఆగిపోయాయని కేంద్రానికి రాసిన లేఖలో తన గోడును వెల్లబోసుకున్నారు. తమకు తెలిసిన కొందరు హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లారని, చికాగోలో తన కుమార్తెను గుర్తించారని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ తన వస్తువులు ఎవరో దొంగలించారని, దీంతో తన కుమార్తె ఆకలితో అలమటిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తన కుమార్తెను తిరిగి భారత్ తీసుకురావాలని ఆవేదన చెందుతూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.