భారత విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఐదేళ్ల వర్క్ వీసాకు ఫ్రాన్స్ గ్రీన్ సిగ్నల్
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫ్రెంచ్ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ మేరకు భారత విద్యార్థులకు శుభవార్తను ప్రకటించింది. మాస్టర్స్ కోర్సులు (ఎంఎస్) లాంటి ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఫ్రెంచ్ గడ్డ మీద అడుగుపెట్టే భారతీయ విద్యార్థులకు అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గుడ్ న్యూస్ అందించారు. చదువు పూర్తయ్యాక 5 ఏళ్ల పాటు ఫ్రాన్స్ లోనే పని చేసుకునే సౌలభ్యం కల్పిస్తున్నామని ఆ దేశ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐదేళ్లతో కూడిన వర్క్ వీసా జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తెలిపారు.
రెండేళ్ల వర్క్ వీసా కాస్త ఐదేళ్లకు పెంపుదల
ఇప్పటి వరకు కేవలం రెండేళ్ల వర్క్ వీసా మాత్రమే అందుబాటులో ఉందని మోదీ చెప్పారు. గతంలో తాను ఫ్రాన్స్ లో పర్యటించినప్పుడు భారతీయ విద్యార్థులకు రెండేళ్లకు మాత్రమే వర్క్ వీసా ఇచ్చేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం అదే విధానం కొనసాగుతోందన్నారు. తాజాగా ఈ వీసా పర్మిట్ ను ఫ్రాన్స్ సర్కార్ ఐదేళ్లకు పొడిగించిందని పారిస్ లోని లా సినె మ్యుజికాలె ఆడిటోరియంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ స్పష్టం చేశారు. అంతకుముందు ప్రధాని గురువారం ఫ్రాన్స్ రాజధాని పారిస్ చేరుకున్నారు. ఈ మేరకు విమానాశ్రయంలో ఫ్రెంచ్ ప్రభుత్వం ఘన స్వాగతం అందించింది. ఈ క్రమంలో ఫ్రెంచ్ ప్రధాన మంత్రి ఎలిజబెత్ బార్నే మోదీకి స్వాగతం పలికారు.