PM Modi: "నాకు ఆ రోజున ఇలాంటి ఇల్లు ఉండి ఉంటే"... కన్నీటిపర్యంతమైన ప్రధాని మోదీ
మహారాష్ట్రలో ఇటీవలే పూర్తయిన భారీ హౌసింగ్ సొసైటీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉద్వేగానికి లోనయ్యారు. ''ఈ ఇళ్లను చూడగానే నా చిన్నపటి విషయాలు గుర్తుకొచ్చాయి. చిన్నతనంలో నేను కూడా ఇలాంటి ఇంట్లో ఉండే అవకాశం వస్తే ఎలా ఉండేదో అని ఆలోచించా'' అంటూ గద్గద స్వరంతో మాట్లాడారు. కన్నీళ్లను దిగమింగుకుని తన ప్రసంగాన్ని కొనసాగించారు. మహారాష్ట్రలోని పీఎంఏవై-అర్బన్ కింద పూర్తయిన 90,000 ఇళ్లను, షోలాపూర్‌లోని రాయ్‌నగర్ హౌసింగ్ సొసైటీకి చెందిన 15,000 ఇళ్లను ప్రధాని దేశానికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను "పిఎం ఆవాస్ యోజన కింద నిర్మించిన దేశంలోనే అతిపెద్ద సొసైటీ" అని ఆయన పేర్కొన్నారు.
ఇళ్లల్లో "జనవరి 22న రామజ్యోతి"
షోలాపూర్ ప్రాజెక్ట్ లబ్దిదారులలో వేలాది మంది చేనేత కార్మికులు,విక్రేతలు,పవర్ లూమ్ కార్మికులు, ర్యాగ్ పికర్స్, బీడీ కార్మికులు, డ్రైవర్లు ఉన్నారు. ప్రజల కలలు సాకారమైతే సంతోషం కలుగుతుందని,వారి ఆశీస్సులే నాకు పెద్ద ఆస్తి అని అన్నారు. ఈ సందర్భంగా అయోధ్యలోని రామ మందిరంలో మహా సంప్రోక్షణ కార్యక్రమం జరిగే రోజున ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో "జనవరి 22న రామజ్యోతి"వెలిగించాలని ప్రజలను కోరారు. ''శ్రీరాముడి నిజాయతీని మా ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుందన్నారు.మన కట్టుబాట్లను గౌరవించాలని రాముడు బోధించాడు.పేదల సంక్షేమం,వారి సాధికారత కోసం మేము పని చేస్తున్నాం "అని ప్రధాని అన్నారు. జనవరి 22న అయోధ్యను సందర్శించవద్దని,దానికి బదులుగా దీపావళి రోజున తమ ఇంట్లో దీపం వెలిగించి 'ప్రాణ ప్రతిష్ట' జరుపుకోవాలన్నారు.