సైలెంట్‌గా ఉండకపోతే.. మీ ఇంటికి ఈడీ వస్తుంది : ప్రతిపక్షాలకు కేంద్రమంత్రి హెచ్చరిక
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హట్ టాపిక్‌గా మారాయి. గురువారం లోక్ సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె కొన్ని వ్యాఖ్యలను చేసింది. విపక్ష నేతలు సైలెంట్ గా ఉండకపోతే.. వారి ఇంటికి ఈడి వస్తుందంటూ కేంద్రమంత్రి మీనాక్షి లేఖి పార్లమెంట్ సాక్షిగా హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి మాట్లాడుతుండగా ప్రతిపక్ష నేతలు బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో తీవ్రంగా స్పందించిన మంత్రి మీ ఇంటికి ఈడీ అధికారులు వస్తారంటూ హెచ్చరికలు జారీ చేసింది. మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది
దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని కొంతకాలంగా ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లోని ప్రతిపక్ష నేతలు, కీలక నేతలపై ఈడీ, సీబీఐ, ఎన్ఐఏ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలే టార్గెట్ చేసుకొని దాడులు జరుగుతున్నాయని, తమ నేతలను బెదిరించి బీజేపీలోకి చేర్చుకుంటున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి మాటలే నిదర్శమని టీఎంసీ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే మండిపడ్డారు. ఇక మంత్రి మీనాక్షి ప్రతిపక్ష నేతలకు వార్నింగ్ ఇవ్వడం పట్ల సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రోలింగ్ నడుస్తోంది.