Page Loader
Rain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు!
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు!

Rain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 25, 2024
08:40 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో వర్షాలు మరలా విజృంభిస్తున్నాయి.ఈ నెల ప్రారంభంలో విస్తృతంగా కురిసిన వర్షాలు కొంత బ్రేక్ ఇచ్చినా,గత నాలుగు రోజులుగా మళ్లీ వర్షాలు దంచికొడుతున్నాయి. తాజాగా,హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు రాష్ట్రానికి వర్ష హెచ్చరికను జారీ చేశారు.మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని,ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల,మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని సూచించారు. భారీ వర్షాల వల్ల ఈదురు గాలులు 30-40 కి.మీ వేగంతో వీచే అవకాశముందని, ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

వివరాలు 

పలు ప్రాంతాల్లో రహదారులు జలమయం

మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా జనగామ జిల్లా దేవరుప్పులలో 11.5 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, నల్గొండ జిల్లా కామారెడ్డి గూడెంలో 10.9 సెం.మీ, తిమ్మాపూర్‌లో 9.9 సెం.మీ, శాలి గౌరారంలో 9.1 సెం.మీ, రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో 8.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. నేడు కూడా భారీ వర్షాలు ఉంటాయని, అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని ప్రజలకు అధికారులు సూచించారు. హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. గాలులతో కూడిన ఈ వర్షం నగరంలో అనేక ప్రాంతాలను అతలాకుతలం చేసింది. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి, రహదారులు జలమయం అయ్యాయి.

వివరాలు 

అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు 

ఎల్బీనగర్, వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, పంజాగుట్ట, మియాపూర్, కొండాపూర్, మాదాపూర్, అమీర్ పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. వర్షం కారణంగా రోడ్లపై భారీగా వరదనీరు చేరి వాహనదారులకు ఇబ్బందులు కలిగింది. మాదాపూర్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, కోఠి వంటి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. నేడు కూడా వర్షం పడే అవకాశం ఉన్నందున, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎమర్జెన్సీ సహాయంకోసం 040-21111111 లేదా 90001 13667 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.