Telangana: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటం వల్ల ఈ వర్షాలు పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ అల్పపీడనం సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించినట్లు వివరించారు. నేడు నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, ఉమ్మడి మహబూబ్‌నగర్, సంగారెడ్డి, మెదక్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు.
పిడుగులు పడే ప్రమాదం
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు
హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది, ఫలితంగా పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. ఈ కారణంగా ట్రాఫిక్ జామ్‌లు చోటు చేసుకున్నాయి. తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట, హబ్సిగూడ, ముషీరాబాద్, సైదాబాద్ వంటి పలు ప్రాంతాల్లో వర్షం తీవ్ర ప్రభావం చూపింది. చైతన్యపురి కమలానగర్‌లో రహదారిపై మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచింది, వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలిగింది. విజయవాడ జాతీయ రహదారిపై ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వర్షాల హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రజలను అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు.