Chandrababu: దిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. మోదీ, కేంద్ర మంత్రులతో కీలక చర్చలు
ప్రస్తుతం దిల్లీలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. కొద్ది సేపట్లో వాజ్‌పేయి సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగే ఎన్డీఏ కూటమి పక్షాల నేతల సమావేశానికి ఆయన హాజరవుతారు. అనంతరం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వేరు వేరు భేటీల్లో పాల్గొననున్నారు.
పెండింగ్ నిధులపై చర్చ
ఆ తర్వాత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ఏపీ రాష్ట్ర సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా ఏపీ రాజధాని అమరావతి కోసం మంజూరైన రైల్వే మార్గాల పనులు త్వరగా ప్రారంభించేందుకు రైల్వే మంత్రిని కోరనున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పెండింగ్ నిధుల విడుదలపై కేంద్ర ఆర్థికమంత్రితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు, రెండు రోజుల పర్యటనలో పాల్గొంటున్నారు.