
Amaravati: ప్రజలు ఆకట్టుకునేలా అమరావతి ప్రభుత్వ సముదాయ సూక్ష్మ నమూనా.. 19న నిర్వహించే ప్రాపర్టీ షోలో ప్రదర్శన
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణం జరుగుతున్న ప్రభుత్వ సముదాయ (గవర్నమెంట్ కాంప్లెక్స్) సూక్ష్మ నమూనాను ప్రభుత్వం ప్రత్యేకంగా తయారు చేయించింది. హైదరాబాద్‌లో రూపుదిద్దుకున్న ఈ నమూనా గురువారం విజయవాడకు చేరుకోనుంది. ఈ నమూనా ద్వారా అమరావతి నగర భవిష్యత్ రూపురేఖలు ప్రజలకు అర్థమయ్యేలా వివిధ మౌలిక వసతులు, ప్రతిష్టాత్మక భవనాలు, సదుపాయాలను ప్రతిబింబించారు. రాజధాని పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన తర్వాత ఎలా ఉండబోతుందో ఈ నమూనా ద్వారా స్పష్టమైన దృశ్యరూపం కనిపించనుంది.
వివరాలు
స్థిరాస్తి ప్రదర్శనలో నమూనా
సూక్ష్మ నమూనాలో అసెంబ్లీ భవనం, హైకోర్టు, 50 అంతస్తుల జీఏడీ టవర్‌తో పాటు నాలుగు హెచ్‌వోడీ టవర్లు, మెట్రో రైలు మార్గాలు, ఐకానిక్ తీగల వంతెన, ముఖ్య రవాణా సదుపాయాలు, ఇతర ప్రధాన మౌలిక వసతులను సమగ్రంగా చూపించారు. నరెడ్కో సెంట్రల్ జోన్, కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు నగరంలోని ఒక కన్వెన్షన్‌లో నిర్వహించబడనున్న 11వ అమరావతి స్థిరాస్తి ప్రదర్శనలో ఈ నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రదర్శన అనంతరం ఈ నమూనాను అమరావతిలోని ఏపీ సీఆర్డీఏ కార్యాలయంలో శాశ్వతంగా ఉంచనున్నారు.