పంజాబ్: డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టుపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
డ్రగ్స్ కేసులో పంజాబ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరా అరెస్ట్ విషయంలో సీఎం భగవంత్ మాన్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారు. డ్రగ్స్‌పై పంజాబ్ ప్రభుత్వం, పోలీసులు యుద్ధం చేసిన తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. తమకు ఏ పార్టీ లేదా వ్యక్తితో వ్యక్తిగత తగాదాలు లేవన్నారు. తమ పోరాటం డ్రగ్స్‌పై మాత్రమే అని స్పష్టం చేశారు. పాటియాలాలో జరిగిన ఆప్ కార్యక్రమంలో కేజ్రీవాల్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌తో పాటు తాము ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ, మిత్రపక్షం కోసం పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టలేమన్నారు.
డ్రగ్స్‌కు వ్యతిరేక పోరాటంలో మాకు మద్దతు ఇవ్వాలి: కేజ్రీవాల్
మాదకద్రవ్యాల వ్యసనం యువత జీవితాలను నాశనం చేస్తోందని, డ్రగ్స్‌కు వ్యతిరేక పోరాటంలో తమకు మద్దతు ఇవ్వాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఏ పార్టీ నాయకుడు డ్రగ్స్ బానిస అయినా లేదా స్మగ్లర్లకు మద్దతు ఇచ్చినా తమకు తెలియజేయాలని చర్యలు తీసుకుంటామని కేజ్రీవాల్ అన్నారు. ఇంతకుముందు పంజాబ్ అంటే డ్రగ్స్‌కు అడ్డాగా ఉండేదని, ఇప్పుడు అలా కాదన్నారు. గత 3-4 నెలలుగా పంజాబ్ పోలీసులు, పంజాబ్ ప్రభుత్వం డ్రగ్స్‌పై యుద్ధం చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అత్యాధునిక సౌకర్యాలతో కూడిన మాతా కౌసల్య ఆస్పత్రిని ప్రారంభించి పంజాబ్ ప్రజలకు అంకితం చేశారు.