అజిత్ దోవల్‌పై అమెరికా ప్రశంసలు; ఆయన 'అంతర్జాతీయ నిధి' అంటూ పొగడ్తలు
జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్‌పై భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ప్రశంసలు కురిపించారు. దేశం పట్ల అతనికి ఉన్న దృక్కోణాన్ని అభినందించారు. ఉత్తరాఖండ్‌లోని మారుమూల పల్లెలో జీవితాన్ని ప్రారంభించిన అజిత్ దోవల్ నేడు భారతదేశానికి మాత్రమే కాకుండా అంతర్జాతీయ సంపదగా మారానన్నారు . దిల్లీలో 'అడ్వాన్సింగ్ ఇండియా-యూఎస్ ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ (ఐసీఇటీ)' అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో గార్సెట్టి ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల భారత పర్యటనలో ఉన్న అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్, అజిత్ దోవల్ సమావేశమై కీలక అంశాలపై చర్చించారు.
మోదీ పర్యటన కోసం అమెరికా ఎదురుచూస్తోంది: జేక్
భారత్-అమెరికా సంబంధాలపై ఎరిక్ గార్సెట్టీ అపారమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భారతీయులు అమెరికన్లను ప్రేమిస్తారని, అమెరికన్లు భారతీయులను ప్రేమిస్తారని చెప్పుకొచ్చారు. రెండు దేశాల మధ్య పునాది చాలా బలంగా ఉందన్నారు. అంతకుముందు జేక్ సుల్లివన్ మాట్లాడుతూ, భారత్‌లో తమ పర్యటన వివరాలను తెలుసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. వచ్చే వారం ప్రధాని మోదీ అమెరికాకు వెళ్తున్న నేపథ్యంలో, ఆయన పర్యటన కోసం తాము ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.