Fake World Cup Ticket: అహ్మదాబాద్: భారత్-పాకిస్థాన్ ప్రపంచకప్ నకిలీ మ్యాచ్ టిక్కెట్లు విక్రయిస్తున్న నలుగురి అరెస్టు
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో త్వరలో జరగనున్న భారత్-పాకిస్థాన్ క్రికెట్ ప్రపంచకప్ మ్యాచ్‌కు సంబంధించిన 50 నకిలీ టిక్కెట్లను ముద్రించి రూ.3 లక్షలకు విక్రయించిన నలుగురిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అక్టోబర్ 14న అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ వర్సెస్ పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుంది. నిందితుల్లో ఒకరు ముందుగా ఒరిజినల్ టిక్కెట్‌ను కొనుగోలు చేసి ఆ తరువాత ఆ టికెట్ ను స్కాన్ చేసి ఫొటోషాప్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఎడిట్ చేశాడు. ఈ ఎడిట్ చేసిన కాపీ తో 200 డూప్లికేట్ టిక్కెట్లను ముద్రించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
కేసు నమోదు చేసిన పోలీసులు
అప్పటికే విక్రయించిన 50 టికెట్లే కాకుండా ముద్రించిన 200 టిక్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జైమిన్ ప్రజాపతి, ద్రుమిల్ ఠాకోర్, రాజ్‌వీర్ ఠాకోర్, కుష్ మీనా గా గుర్తించారు. వీరందరూ అహ్మదాబాద్ లేదా గాంధీనగర్‌లోని వివిధ ప్రాంతాల నివాసితులని పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులపై నేరపూరిత కుట్ర, మోసం, నమ్మక ద్రోహం, ఫోర్జరీ తదితర అభియోగాలపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.