Priyanka Gandhi : రాజ్యాంగం అంటే సంఘ్ బుక్ కాదు.. లోక్‌సభలో ప్రియాంక గాంధీ తొలి ప్రసంగం..
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన 75వ ఏడాది సందర్భంగా లోక్‌సభలో ప్రత్యేక చర్చ జరుగుతోంది. ఈ చర్చలో విపక్షాల తరఫున కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన్నారు. ఇటీవల ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ, లోక్‌సభలో తన తొలి ప్రసంగాన్ని చేశారు. ఈ సందర్భంగా ఆమె అధికార బీజేపీ, ఆరెస్సెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని సంఘ్ (ఆరెస్సెస్) పుస్తకంగా చూడటం సరైనదికాదని ఆమె మండిపడ్డారు.
ఉన్నావ్ అత్యాచార ఘటన
ఆమె మాట్లాడుతూ, "బీజేపీ ఎప్పుడూ గతాన్ని మాత్రమే మాట్లాడుతుంది. దేశ అభివృద్ధి కోసం ప్రస్తుతానికి ఏమి చేస్తున్నారో చెప్పాలి. దేశంలో జరిగే ప్రతి విషయంలోనూ నెహ్రూనే కారణమా? మీరు నెహ్రూ పేరును, ప్రసంగాలను పుస్తకాల నుంచి తొలగించగలరేమో గానీ, స్వతంత్ర పోరాటంలో, జాతి నిర్మాణంలో ఆయన పాత్రను చెరిపేయలేరు" అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె 2017లో జరిగిన ఉన్నావ్ అత్యాచార ఘటనను ప్రస్తావిస్తూ, ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకు పోరాడే హక్కును రాజ్యాంగమే ఇచ్చిందని పేర్కొన్నారు.
అదానీ అంశంపై
ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ, అదానీ వ్యవహారంపై పరోక్ష విమర్శలు చేశారు. ''ఒక వ్యక్తిని కాపాడటానికి 142 కోట్ల మంది భారతీయుల ప్రయోజనాలను మరిచిపోతున్నారు. సంపద, రోడ్లు, పోర్టులు, గనులు అన్నీ ఆ వ్యక్తికే అప్పగిస్తున్నారు'' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల తరఫున నిలబడి పోరాడే ప్రతిపక్షాల గళాన్ని అణచివేయడానికి తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసి విపక్ష నేతలపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ''మన స్వాతంత్ర్య పోరాటం ప్రపంచంలోని ఇతర దేశాల పోరాటాలతో పోలిస్తే ప్రత్యేకమైనది. అది సత్యం, అహింస అనే పునాదులపై సాగింది. ఈ ఉద్యమం ప్రజాస్వామ్యానికి ప్రాముఖ్యాన్ని చాటిచెప్పింది. ఆ ఉద్యమం నుంచి పుట్టినదే మన రాజ్యాంగం.
రాజ్యాంగాన్ని మార్చేవారేమో..
ఇది కేవలం ఒక పత్రం కాదు; ఇది అంబేడ్కర్, మౌలానా ఆజాద్, రాజగోపాలచారి, నెహ్రూ వంటి మహానేతలు తమ జీవితాలను అంకితం చేసి రూపొందించినది. ప్రజల హక్కులను కాపాడే ఈ రాజ్యాంగం 'సురక్షా కవచం'గా ఉంది. కానీ ఎన్డీయే ప్రభుత్వం గత పదేళ్లలో ఈ కవచాన్ని బలహీనపరచడానికి పలు ప్రయత్నాలు చేసింది. లేట్రల్ ఎంట్రీ, ప్రైవేటీకరణ వంటి చర్యలతో రిజర్వేషన్లను తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. లోక్‌సభలో మెజార్టీ పొందితే రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నించింది. అది సాధ్యం కాకపోవడంతో ఆ యత్నాలను వదిలేశారు. ఇది రాజ్యాంగం... సంఘ్ రూల్ బుక్ కాదు'' అని కాంగ్రెస్ ఎంపీ తీవ్ర విమర్శలు చేశారు. కులగణన చేపట్టడం దేశ ప్రజలందరి ఆకాంక్ష అని ఆయన స్పష్టంచేశారు.