ys Jagan: హంద్రీ నీవా కుప్పం బ్రాంచ్ కెనాల్ కు నీటిని విడుదల చేసిన వైఎస్ జగన్
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద సోమవారం హంద్రీ నీవా కుప్పం బ్రాంచ్ కెనాల్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా నీటిని విడుదల చేశారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ఫేజ్-2 కింద రూ.560.29 కోట్లతో పూర్తి చేసిన స్మారక ప్రాజెక్టు, కొత్తగా నిర్మించిన కుప్పం బ్రాంచ్ కెనాల్ నుండి నీటిని విడుదల చేశారు. కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేలా చేసింది వైసీపీ ప్రభుత్వం. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని 4.02 లక్షల జనాభాకు తాగు నీరు అందిస్తూ అందించేందుకు కృష్ణా జలాలను సీఎం జగన్ విడుదల చేశారు.
కుప్పం బ్రాంచి కెనాల్ ప్రత్యేకతలు ఇవే..
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కృష్ణా జలాలు విడుదల చేశారు. కుప్పం బ్రాంచి కెనాల్ ప్రత్యేకతలు పుంగనూరు బ్రాంచ్ కెనాల్ 207.80 కి.మీ వద్ద (చిత్తూరు జిల్లా పెద్ద పంజాణీ మండలం అప్పినపల్లె చెరువు వద్ద) కుప్పం బ్రాంచ్ కెనాల్ ప్రారంభం కానుంది. నీటి సామర్థ్యం : 6.130 క్యూమెక్స్ (216 క్యూసెక్కులు) కాలువ పొడవు : 123.641 కి.మీ వ్యయం : రూ. 560.29 కోట్లు కట్టడాలు : 330 లిఫ్ట్ లు : 3 ఆయకట్టు : 110 చెరువుల క్రింద 6,300 ఎకరాలు తాగునీరు : పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు చెందిన 4.02 లక్షల మంది ప్రజలకు
రెండు లక్షల మందికి సాగునీరు
చంద్రబాబు పాలన వైఫల్యాలను ఎండగడుతూ.. 35 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహించి 14 ఏళ్లు సీఎం పీఠాన్ని అధిష్టించారని, ఇంతకాలం కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను పూర్తి చేయలేకపోయారని, దానికి బదులుగా దోపిడీ చేశారని వైఎస్ జగన్ అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రగతిపథంలోకి మార్చిందని, రెండు లక్షల మందికి సాగునీరు అందించి కుప్పం చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిందని జగన్ అన్నారు. వైఎస్సార్‌సీపీ సాంఘిక సంక్షేమానికి, గత టీడీపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న పూర్తి వైరుధ్యాన్ని ఎత్తిచూపుతూ కుప్పంలో కేవలం 31 వేల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున సామాజిక భద్రత పింఛను అందించేందుకు చంద్రబాబు నాయుడు రూ.200 కోట్లు కేటాయించారని వైఎస్ జగన్ వివరించారు.
కుప్పానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.155 కోట్ల ప్రోత్సాహకాలు
దీనికి భిన్నంగా గత 57 నెలల కాలంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పింఛన్ మొత్తాన్ని రూ.3వేలకు పెంచి కుప్పంలో 45,374 మంది లబ్ధిదారులకు విస్తరించి, నియోజకవర్గంలో కేవలం పింఛన్లకే రూ.507 కోట్లు వెచ్చించిం దన్నారు. వైసీపీ ప్రభుత్వం కుప్పం మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.66 కోట్లు కేటాయించిందన్నారు. గత 57 నెలల్లో,తమ ప్రభుత్వం కుప్పం నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డిబిటి)ద్వారా మొత్తం రూ.1,400 కోట్లు డిబిటి,నాన్-డిబిటి మార్గాల ద్వారా రూ. 1,889 కోట్ల ప్రయోజనాలను పంపిణీ చేసిందన్నారు. దీనివల్ల 82,039 కుటుంబాలకులబ్ది చేకూరిందన్నారు.అమ్మ ఒడి పథకం కింద కుప్పం నియోజకవర్గంలోని 35,951 మంది తల్లులకు తమ పిల్లలను బడికి పంపేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.155 కోట్ల ప్రోత్సాహకాలను అందించిందన్నారు.