Canada : విదేశాల్లో భారత విద్యార్థుల మరణాలపై కేంద్రం గణాంకాలు..ఏ దేశంలో ఎక్కువంటే
విదేశాల్లో భారత విద్యార్థులు 2018 నుంచి ఎక్కువ మంది మరణించారని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి అన్నారు. ఇప్పటికే 2018 నుంచి వివిధ దేశాల్లో దాదాపుగా 403మంది విద్యార్థులు వివిధ కారణాలతో ప్రాణాలు వదిలారని కేంద్రమంత్రి వీ.మురళిధరన్ వెల్లడించారు.అయితే ఇందులో కెనడాలో అధికంగా మరణాలు సంభవించాయన్నారు. సహజ మరణాలు, ప్రమాదాలు, వైద్య పరిస్థితులు వివిధ కారణాలతో 2018 నుంచి ఇప్పటివరకు 403మంది భారతీయ విద్యార్థులు మరణించారని కేంద్ర ప్రభుత్వం గురువారం రాజ్యసభలో ప్రకటించింది. ఈ మేరకు 34దేశాల్లోకి అత్యధికంగా కెనడాలో 91 మంది భారత విద్యార్థులు కన్నుమూశారు. ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే,దానిపై విచారణ జరిపి నేరస్థులకు శిక్ష పడేలా చేసేందుకు ఆయా దేశాల్లోని సంబంధిత అధికారులను వెంటనే సంప్రదించాలని సూచించారు.
దేశాల వారీగా భారతీయ విద్యార్థుల మరణాలు :
2018 నుంచి విదేశాల్లో దాదాపుగా 403 భారతీయ విద్యార్థుల మరణాలు నమోదయ్యాయని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కెనడాలో 2018 నుంచి 91 మంది, యునైటెడ్ కింగ్‌డమ్ (UK) (48), రష్యా (40), యునైటెడ్ స్టేట్స్ USA (36), ఆస్ట్రేలియా (35), ఉక్రెయిన్ (21), జర్మనీ (20), సైప్రస్ (14), ఇటలీ, ఫిలిప్పీన్స్‌లలో (10 చొప్పున) విద్యార్థులు మృతి చెందారు. ఫలితంగా విదేశాల్లో భారతీయ విద్యార్థుల భద్రతే తమ మొదటి ప్రాధాన్యతని మురళీధరన్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో కష్టాల్లో ఉన్న భారతీయ విద్యార్థులకు అవసరమైనప్పుడు అత్యవసర వైద్య సంరక్షణ, బోర్డింగ్, లాడ్జింగ్ వంటి సౌకర్యాలతో పాటు కావాల్సిన అన్నీ సహకారాలు అందిస్తామన్నారు.