
P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అన్ని రంగాల్లో బలంగా ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరం ప్రశంసించారు.
అదే సమయంలో విపక్షాల 'ఇండియా కూటమి' భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తం చేశారు.
కూటమిలో నెలకొన్న అస్పష్టత వాస్తవమేనని ఆయన అంగీకరించారు.ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
వివరాలు
బీజేపీకి ప్రతి వ్యవస్థపై పట్టు ఉంది: చిదంబరం
ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న చిదంబరం మాట్లాడుతూ.. ''ఇండియా కూటమి స్థిరంగా కొనసాగితే ఆనందంగా ఉంటుంది. కానీ ప్రస్తుతానికి అది బలహీనంగా కనిపిస్తోంది. అయితే తిరిగి బలపడేందుకు ఇప్పటికీ సమయం ఉంది. ఇక బీజేపీ విషయానికొస్తే, చాలా శక్తివంతంగా, వ్యవస్థీకృతంగా పనిచేస్తోంది. నా అనుభవంతో చెప్పగలను,అన్ని రంగాల్లోను అంతగా పటిష్టంగా పనిచేసే మరో పార్టీ ప్రస్తుతం లేదు.బీజేపీకి ప్రతి వ్యవస్థపై పట్టు ఉంది.వాటిని తన నియంత్రణలోకి తీసుకునే సామర్థ్యం ఆ పార్టీకి ఉంది. అలాంటి పరిస్థితుల్లో విపక్ష కూటమి బలపడాలంటే, అన్ని విభాగాల్లోనూ తనను తాను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో 2029 సాధారణ ఎన్నికలు అత్యంత కీలకంగా మారనున్నాయి'' అని అభిప్రాయపడ్డారు.
వివరాలు
చిదంబరం వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ
చిదంబరం చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది.
వరుస పరాజయాలు కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా కలిచివేశాయని ఆ పార్టీ నేత అమిత్ మాలవీయ విమర్శించారు.
మరో బీజేపీ నేత ప్రదీప్ బండారీ మాట్లాడుతూ.. ''చిదంబరం స్వయంగా అంగీకరించినట్టుగా, విపక్ష కూటమిలో స్పష్టత లేదు. బీజేపీ మాత్రం బలమైన పార్టీగా కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదన్న విషయం రాహుల్ గాంధీకి దగ్గరగా ఉన్న వారికి కూడా తెలుసు'' అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.