India-Canada: అగ్ర దౌత్యవేత్తలను బహిష్కరించిన భారత్,కెనడా..ఇరుదేశాల మధ్య క్షిణిస్తున్న సంబంధాలు..ఈ వివాదంలో ఏమి జరుగబోతోంది
భారత్ ప్రభుత్వం ఆరుగురు కెనడియన్ దౌత్యవేత్తలను బహిష్కరించడానికి నిర్ణయించినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది. ఈ దౌత్యవేత్తలలో యాక్టింగ్ హై కమిషనర్ స్టీవర్ట్ రాస్ వీలర్, డిప్యూటీ హై కమిషనర్ పాట్రిక్ హెబర్ట్, ఫస్ట్ సెక్రటరీలు మేరీ కేథరీన్ జోలీ, లాన్ రాస్ డేవిడ్ ట్రైట్స్, ఆడమ్ జేమ్స్ చుయిప్కా, పౌలా ఓర్జులాలు ఉన్నారు. వీరిని 2024 అక్టోబర్ 19 శనివారం రాత్రి 11:59 గంటల నాటికి భారతదేశం నుంచి వెళ్లాలని కోరారు. ఈ ప్రకటన వెలువడటానికి ముందు, కెనడాలోని తమ హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మతో పాటు, కొన్ని ఇతర దౌత్యవేత్తలను భారత్ ఉపసంహరించామని ప్రకటించింది.
నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వం సహకరించడంలేదు: ట్రూడో
భారత ప్రభుత్వం ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల అనంతరం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. ఒట్టావాలో నిర్వహించిన మీడియా సమావేశంలో, ఆరుగురు భారత దౌత్యవేత్తలను తామే బహిష్కరించామని ఆయన తెలిపారు. నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వం సహకరించకపోవడమే దీనికి కారణమని ట్రూడో పేర్కొన్నారు. సిక్కు వేర్పాటువాద నేత హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత హైకమిషనర్‌తో పాటు ఇతర దౌత్యవేత్తలను కెనడా 'పర్సన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్'(దర్యాప్తుకు సంబంధించి సమాచారం ఉన్నవారు)గా పేర్కొనడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో,కెనడాలోని ఈ వార్త దౌత్య సందేశం ద్వారా అందిందని,దీనిపై ప్రతిగా చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని తెలిపింది.
నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం
"ఈ అసంబద్ధమైన ఆరోపణలను భారత ప్రభుత్వం పూర్తిగా ఖండిస్తోంది" అని పేర్కొన్నారు. గతేడాది కెనడాలో జరిగిన నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉండొచ్చని ట్రూడో చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ వివాదంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షిణించాయి. దీంతో, కెనడాకు భారత్ వీసా సేవలను నిలిపివేయాలని, దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని కోరింది. సోమవారం (అక్టోబర్ 14) కెనడా ప్రకటనపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ఆగ్రహంగా స్పందించింది. కెనడా ఆరోపణలు ట్రూడో 'రాజకీయ ఎజెండా'లో భాగమని విమర్శించింది. "భారత దౌత్యవేత్తలపై ఆరోపణలు చేయడానికి కెనడా ప్రభుత్వం చేస్తున్న తాజా ప్రయత్నాలకు ప్రతిస్పందనగా తదుపరి చర్యలు తీసుకునే హక్కు భారత్‌కు ఉంది"అని ఆ ప్రకటనలో పేర్కొంది.
స్టువర్ట్ వీలర్‌కు భారత విదేశీ వ్యవహారాల శాఖ సమన్లు జారీ
కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ 36ఏళ్ల కెరీర్‌ను ప్రస్తావిస్తూ ఆయనకు మద్దతుగా భారత విదేశాంగశాఖ కొన్ని వ్యాఖ్యలు చేసింది. "కెనడా ప్రభుత్వం ఆయనపై చేసిన ఆరోపణలు హాస్యాస్పదమైనవి,ధిక్కారపూరితమైనవి"అని వ్యాఖ్యానించింది. కెనడా చర్యలపై వివరణ ఇవ్వాలని దిల్లీలోని 'కెనడా డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్'స్టువర్ట్ వీలర్‌కు భారత విదేశీ వ్యవహారాల శాఖ సమన్లు జారీచేసింది. కెనడాలోని భారత హైకమిషనర్,ఇతర దౌత్యవేత్తలు, అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయనకు తెలియజేసినట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తమ దౌత్యవేత్తల భద్రతకు ప్రస్తుత కెనడా ప్రభుత్వం కట్టుబడి ఉందన్న నమ్మకం తమకు లేదని, అందుకే కెనడాలోని తమ హైకమిషనర్,ఇతర దౌత్యవేత్తలు,అధికారులను ఉపసంహరించుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొంది.
భారత్, కెనడా మధ్య వివాదం ఎలా పెరిగింది?
భారత్ ప్రకటన తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. కెనడాలో హింస-సంబంధిత కార్యకలాపాల్లో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయంపై దర్యాప్తుకు సహకరించడానికి భారత ప్రభుత్వం నిరాకరించిందని ట్రూడో ఆరోపించారు. "కెనడా గడ్డపై కెనడియన్లకు వ్యతిరేకంగా జరిగే నేరపూరిత కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం ద్వారా భారత ప్రభుత్వం తప్పు చేసింది" అని ఆయన వ్యాఖ్యానించారు. "భారత దౌత్యవేత్తలు కెనడా పౌరుల సమాచారాన్ని సేకరించి, హింసాత్మక నేరాలకు పాల్పడేవారికి చేరవేస్తున్నారు" అని ట్రూడో ఆరోపించారు. పౌరుల భద్రతకు భంగం కలిగించే కార్యకలాపాల్లో భారత ప్రభుత్వ ఏజెంట్లు పాల్గొంటున్నారని, అందుకు సంబంధించి తమ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్(ఆర్‌సీఎంపీ) చెప్పారు.
హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో..
హర్‌దీప్ సింగ్ నిజ్జర్ కెనడా పౌరసత్వం కలిగిన భారత సంతతి వ్యక్తి, వయసు 45 ఏళ్లు. ఆయన్ను 2023 జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలోని ఓ సిక్కు గురుద్వారా వద్ద ముసుగులు ధరించిన ఇద్దరు సాయుధులు కాల్చి చంపారు. ప్రత్యేక సిక్కు దేశం డిమాండ్ చేసే ఖలిస్తాన్ ఉద్యమానికి ఆయన మద్దతుదారు, దాని కోసం బహిరంగంగా ప్రచారం కూడా చేశారు. 2020లో భారత ప్రభుత్వం నిజ్జర్‌ను 'ఉగ్రవాది'గా ప్రకటించింది, ఈ ఆరోపణలు ఆధార రహితమైనవని ఆయన మద్దతుదారులు తెలిపారు. నిజ్జర్ హత్య 'టార్గెటెడ్ ఎటాక్ (లక్షిత దాడి)'గా కెనడా పోలీసులు తెలిపారు. ఈ ఘటన కెనడా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని ట్రూడో గతంలో చెప్పారు.
కెనడా విదేశీ వ్యవహారాల మంత్రి వ్యాఖ్యలు
అయితే, 2023 అక్టోబర్‌లో భారత్ వీసాల జారీని పునఃప్రారంభించిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగైనట్లు కనిపిస్తున్నాయి. అయితే, భారత్‌తో కెనడా సంబంధాలు ఉద్రిక్తమైనవని, చాలా కష్టమైనవని కెనడా విదేశీ వ్యవహారాల మంత్రి మెలానీ జోలీ గతవారం వ్యాఖ్యానించారు. కెనడియన్ గడ్డపై నిజ్జర్ వంటి మరిన్ని హత్యలు జరిగే ప్రమాదం ఉందని కూడా ఆమె చెప్పారు.