అంగారక, శుక్ర గ్రహాలపైకి వెళ్లే సత్తా భారత్‌కు ఉంది: ఇస్రో చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
భారత అంతరిక్ష రంగంపై ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.తనకు సైన్స్ తో పాటు ఆధ్యాత్మిక రంగంపైనా ఆసక్తి ఉందని వెల్లడించారు. ఈ మేరకు తరచుగా ఆలయాలను సందర్శిస్తానన్నారు. చంద్రయాన్-3 విజయం తర్వాత ఇస్రో తదుపరి ప్రణాళికల గురించి ఆయన మాట్లాడారు. చంద్రుడితో పాటు అంగారక, శుక్ర గ్రహాలపైకి వెళ్లే సత్తా భారత్‌కు ఉందన్నారు. పరిశోధనల కోసం మరిన్ని పెట్టుబడులు అవసరమన్నారు. ఈ నేపథ్యంలో అంతరిక్ష పరిశోధనా రంగం సహా భారతదేశం అభివృద్ధి చెందడం తమ లక్ష్యమన్నారు. దేశ అంతరిక్ష రంగ అభివృద్ధిపై ప్రధాని మోదీకి దీర్ఘకాలిక ప్రణాళికలు ఉన్నట్లు ఇస్రో ఛైర్మన్ పేర్కొన్నారు. తమకు నిర్దేశించిన భవిష్యత్ లక్ష్యాలను అందుకునేందుకు రెఢీగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
శివశక్తి పేరు పెట్టడాన్ని సమర్థించిన ఇస్రో ఛైర్మన్ సోమనాథ్
కేరళలోని తిరువనంతపురంలోని భద్రకాళి ఆలయాన్ని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ సందర్శించారు. గ్రంథాలను చదివి విశ్వంలో మనిషి మనుగడకున్న నిజమైన అర్థాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తానన్నారు. విక్రమ్ ల్యాండర్ దిగిన చోటుకు శివశక్తిగా పేరు పెట్టడాన్ని ఆయన సమర్థించారు. తిరంగా (చంద్రయాన్ 2 క్రాష్ అయిన ప్రదేశం పేరు)తో పాటు శివశక్తి భారతీయతకు చిహ్నమని సోమనాథ్ చెప్పారు. చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్ పనితీరు మెరుగ్గానే ఉందని, ఎప్పటికప్పుడు సమాచారం వస్తోందన్నారు. 14 రోజుల్లో ల్యాండర్, రోవర్ పనితీరును క్షుణ్ణంగా పరీక్షించి మెరుగైన ఫలితాలు రాబడతామని ధీమా వ్యక్తం చేశారు. గ్రీస్ పర్యటన తర్వాత శనివారం ఇస్ట్రాక్ కార్యాలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ, జై జవాన్, జై కిసాన్‌తో పాటు జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అన్నారు.