
India- China: భారత్-చైనా సరిహద్దు వివాదం.. ఉద్రిక్తతలు తగ్గాలంటే చర్చలే మార్గం : జైశంకర్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-చైనా సరిహద్దు వివాదం కొన్నేళ్లుగా ఉద్రిక్తతలను కొనసాగిస్తోంది. భవిష్యత్తులోనూ కొన్ని సమస్యలు కొనసాగుతాయని, అయితే వాటిని పరిష్కరించే మార్గాలు ఉన్నాయని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పేర్కొన్నారు.
2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ గురించి మాట్లాడుతూ, అది సరైన పరిష్కార మార్గం కాదని స్పష్టం చేశారు.
2020లో తూర్పు లద్దాఖ్‌లో గల్వాన్ లోయ వద్ద భారత్-చైనా సైన్యాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
వాస్తవాధీన రేఖ వెంబడి యథాతథ స్థితిని మార్చేందుకు చైనా చేసిన ప్రయత్నమే ఈ ఉద్రిక్తతకు కారణమైంది.
దాదాపు 50 సంవత్సరాల తర్వాత ఈ ఘర్షణలో ప్రాణనష్టం సంభవించింది. భారత సైన్యంలో 20 మంది వీరమరణం పొందగా, దేశవ్యాప్తంగా చైనా వ్యతిరేక భావోద్వేగాలు మరింత మిన్నంటాయి.
Details
రెండు దేశాల మధ్య సంబంధాల్లో కొంత పురోగతి
ఆసియా సొసైటీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడుతూ, ఈ తరహా ఘటనలు సమస్యల పరిష్కారానికి సరైన మార్గం కాదని తేల్చిచెప్పారు.
2024 అక్టోబర్ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాల్లో కొంత పురోగతి కనిపిస్తోంది. 2020లో జరిగిన ఘటనల ప్రభావం నుంచి దశలవారీగా బయటపడేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని జైశంకర్ వివరించారు.
ఆ తర్వాత ఇరు దేశాల మధ్య పలు మిలిటరీ, దౌత్య చర్చలు జరిగాయి. గత అక్టోబర్‌లో భారత్-చైనా మధ్య కీలక గస్తీ ఒప్పందం కుదిరింది.
2020 నాటి యథాస్థితి LAC వెంబడి కొనసాగనుంది. ఇరుదేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన ప్రాంతాలకు స్వేచ్ఛగా వెళ్లేందుకు అనుమతించారు.
Details
డబ్ల్యూఎంసీసీ సమావేశంలో పలు ప్రతిపాదనలు
తాజాగా భారత్-చైనా బీజింగ్‌లో జరిగిన చర్చల్లో సరిహద్దుల్లో సహకారం, సమర్థ నిర్వహణ, నదుల సమాచారం పంచుకోవడం, కైలాస్-మానససరోవర్ యాత్రకు అనుమతులు వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.
సరిహద్దు సమస్యల పరిష్కారానికి డబ్ల్యూఎంసీసీ సమావేశంలో పలు ప్రతిపాదనలు పరిశీలించారు.
డిసెంబర్‌లో జరిగిన ప్రత్యేక ప్రతినిధుల చర్చల్లో జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోభాల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తీసుకున్న నిర్ణయాలను అమలుచేసేందుకు పలు చర్యలు తీసుకున్నారు.
Details
భారత్ భూభాగాలను ఆక్రమించడాన్ని తాము అంగీకరించం
అయితే చర్చలు జరుగుతూనే చైనా తన కుయుక్తులకు పాల్పడుతోంది. లద్దాఖ్ ప్రాంతంలోని కొన్ని భూభాగాల్లో కౌంటీలను ఏర్పాటు చేస్తోంది.
'చైనా ఏర్పాటుచేస్తున్న రెండు కొత్త కౌంటీలలో కొన్ని ప్రాంతాలు లద్దాఖ్ పరిధిలోకి వస్తాయి. భారత భూభాగాలను ఆక్రమించడాన్ని తాము ఎప్పటికీ అంగీకరించబోం.
భారత సార్వభౌమాధికారంపై మా వైఖరిని ఈ చర్యలు ఏమాత్రం ప్రభావితం చేయవు. చైనా చేపడుతున్న బలవంతపు ఆక్రమణలకు చట్టబద్ధతను కల్పించలేవని కేంద్రం స్పష్టం చేసింది.
సరిహద్దు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.