ఇండో చైనా సరిహద్దు వివాదాలు.. ఇరుదేశాల 19వ సారి శాంతి చర్చలు సానుకూలం
ఇండియా - చైనా సైనిక ఉన్నతాధికారుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. తాజాగా 19వ సారి రౌండ్ టేబుల్ చర్చలు జరిగాయి. ఇరు దేశాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సుధీర్ఘ చర్చలో సానూకూల వాతావరణం ఏర్పడింది. ఈ మేరకు రెండు దేశాలు సహృద్భావంతో ఉన్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. మరోవైపు తూర్పు లద్దాక్ సరిహద్దు ప్రాంతంలో గత కొద్దిరోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే భారత్ - చైనాల సైనిక ఉన్నతాధికారులు తమ అభిప్రాయాలను బహిరంగంగా పంచుకున్నారు. భవిష్యత్ లో మరిన్ని చర్చలు జరిపేందుకు సిద్ధమేనని పేర్కొన్నాయి. భారత్ - చైనాల కార్ప్స్-కమాండర్ స్థాయి చర్చలు చుసుల్-మాల్దో సరిహద్దులో ఆగస్ట్ 13, 14న జరిగినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.
క్షేత్రస్థాయిలో శాంతిని నెలకొల్పేందుకు ఇరుదేశాల గ్రీన్ సిగ్నల్
వాస్తవాధీన రేఖ వద్ద అనేక అంశాలపై ఇరు దేశాలు నిర్మాణాత్మకంగా చర్చించాయని విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇక ముందూ చర్చలు కొనసాగించే ఉద్దేశంలో ఇరు దేశాలున్నాయని వివరించింది. సరిహద్దులో నెలకొన్న సమస్యలను క్రమేపీ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించాయి. సైనిక, దౌత్యపరంగా చర్చలు, సంప్రదింపులు కొనసాగించేందుకు రెండు దేశాలు సంసిద్ధత వ్యక్తం చేశాయి.సరిహద్దు ప్రాంతాల్లోని క్షేత్రస్థాయిలో శాంతిని నెలకొల్పేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. గల్వాన్ ఘటన తర్వాత లద్దాక్ ప్రాంతంలో ఇప్పటికే 68 వేల మంది సైనికులను మోహరించినట్లు ఇటీవలే భారత రక్షణశాఖ వివరించింది. 90కిపైగా వార్ హెడ్స్, రాడార్ లు, అధునాతన ఆయుధాలను తరలించినట్లు వెల్లడించింది. ఇండో చైనా సరిహద్దులో సమస్యల పరిష్కారం కోసం ఇరు దేశాల మధ్య చర్చలు నిరంతరం కొనసాగుతున్నాయి.