ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యపై కెనడా ఆరోపణలను ఖండించిన భారత్
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యను హత్య చేయడంలో భారత్ పాత్ర ఉందంటూ కెనడా ప్రభుత్వం ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం ఖండించింది. కెనడా చేసిన ఆరోపణలను అసంబద్ధమైనవి అని కొట్టిపారేసింది. భారత్‌కు చట్టబద్ధమైన పాలన పట్ల బలమైన విశ్వసనీయత, నిబద్ధత ఉందని స్పష్టం చేసింది. కెనడా పార్లమెంట్‌లో ఆ దేశ ప్రధాని, అలాగే విదేశాంగ మంత్రి ప్రకటనలను తాము చూసినట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే తాము వారి ప్రకటనలను తిరస్కరిస్తున్నట్లు చెప్పింది. జూన్ 18న సర్రేలోని గురుద్వారా వెలుపల ఇద్దరు గుర్తుతెలియని నిజ్జర్‌ను కాల్చి చంపారు.
నిజ్జర్ హత్య అంశంపై మోదీతో చర్చించా: ట్రూడో
నిజ్జర్ హత్యకు భారత ప్రభుత్వ ఇంటెలిజెన్సీ ఏజెంట్లకు మధ్య సంబంధాన్ని తమ దేశ భద్రతా సంస్థలు పరిశీలిస్తున్నాయని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మంగళవారం తెలిపారు. జీ20 సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు ట్రూడో వివరించారు. ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు కెనడాలో ఆశ్రయం పొందుతున్న ఖలిస్థానీ ఉగ్రవాదుల నుంచి దృష్టిని మరల్చడానికి దోహదపడుతాయని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇలాంటి ఆరోపణలు భారతదేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు ముప్పును కొనసాగిస్తున్నాయని చెప్పింది. ఖలిస్థానీ ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో కెనడా ఉదాసీనంగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. నిజ్జర్ హత్య ఆరోపణల నేపథ్యంలో భారతీయ దౌత్యవేత్తను కెనడా తమ దేశం నుంచి బహిష్కరించింది.