
Male Drones: శత్రు దేశాల కదలికపై నిఘా పెట్టేందుకు MALE డ్రోన్స్ కొనుగోలుకు కేంద్రం రెడీ..!
ఈ వార్తాకథనం ఏంటి
దేశ సరిహద్దు భద్రతను మరింతగా శక్తివంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అంతరిక్షం నుంచి నిఘాను కొనసాగించేందుకు ఇప్పటికే సొంత ఉపగ్రహాలను వినియోగిస్తున్న భారత్.. ఇప్పుడు విమానాలు ఎగిరే ఎత్తు నుంచి సైతం శత్రువుల ప్రతి కదలికను పసిగట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ దిశగా మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ (MALE) డ్రోన్‌ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ ప్రాజెక్టు కింద దేశీయ ప్రైవేట్ రంగ సంస్థల నుంచి మొత్తం 87 MALE డ్రోన్లు కొన్నే అవకాశం ఉంది. రక్షణ శాఖ వర్గాల సమాచారం ప్రకారం,కేంద్ర ప్రభుత్వం దీనిపై దాదాపు రూ. 20 వేల కోట్లు వెచ్చించనుంది.
వివరాలు
సైనిక అవసరాలకు అనుగుణంగా వీటి రూపకల్పన
ఇది పూర్తిగా మేక్ ఇన్ ఇండియా పథకంలో భాగంగా చేపడుతోంది. దీనివల్ల దేశీయ డ్రోన్ సాంకేతికతకు ప్రోత్సాహం లభించడంతోపాటు, విదేశీ సరఫరాదారులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. ఇంతవరకు ఈ రకమైన అధునాతన MALE డ్రోన్‌ల తయారీకి దేశీయ సంస్థలకు అవకాశం రాలేదు. గతంలో ఈ డ్రోన్లను ఇజ్రాయెల్ సంస్థల నుంచి కొనుగోలు చేసిన కేంద్రం,ఈసారి మాత్రం స్వదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇస్తోంది. కొనుగోలుకు ముందు ప్రతి డ్రోన్‌ను అవసరమైన పరీక్షల కింద ఉంచుతారు. సైనిక అవసరాలకు అనుగుణంగా వీటి రూపకల్పన, సాంకేతికతను పరిశీలిస్తారు.అవసరమైతే మార్పులు సూచించే అవకాశమూ ఉంటుంది. ఈ డ్రోన్లను కేవలం నిఘా కోసమే కాకుండా,యుద్ధ అవసరాలకు కూడా అనుకూలంగా రూపొందిస్తున్నారు. ఇవి రియల్ టైమ్ ఇంటెలిజెన్స్,సర్వైలెన్స్,రీకానసెన్స్ (ISR)సామర్థ్యాలను కలిగి ఉంటాయి.
వివరాలు
డ్రోన్‌ల తయారీలో 60శాతం కంటే ఎక్కువ భాగాలు స్వదేశీ ఉత్పత్తులే
ఈ డ్రోన్లలో అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే,ఇవి కనీసం 35 వేల అడుగుల ఎత్తులో సుమారు 30 గంటలకు పైగా ఎగురగలుగుతాయి. ఇవి నిరంతర్యంగా నిఘా కొనసాగించేందుకు అత్యంత సరైన సాధనంగా నిలవనున్నాయి. అంతేకాదు,ఈ డ్రోన్‌ల తయారీలో 60శాతం కంటే ఎక్కువ భాగాలు స్వదేశీ ఉత్పత్తులే కావాల్సిందిగా షరతులు విధించనున్నారు. MALE డ్రోన్ల చేరికతో భారత త్రివిధ దళాల నిఘా శక్తి మరింత అభివృద్ధి చెందనుంది.
వివరాలు
ప్రతిపాదనను పరిశీలించనున్న రక్షణ మంత్రిత్వ శాఖకు ఉన్నతస్థాయి కమిటీ
ముఖ్యంగా భారత వైమానిక దళానికి తూర్పు, పశ్చిమ సరిహద్దుల్లో శత్రు కదలికలపై బలమైన నిఘా కొనసాగించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ప్రతిపాదనను రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతస్థాయి కమిటీ పరిశీలించనుంది. ఆమోదం లభించిన వెంటనే డ్రోన్ల కొనుగోలు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమవుతుంది. దీని ద్వారా దేశ సరిహద్దుల్లో శత్రు చర్యలను గమనించడం, వాటిపై సమర్థవంతంగా స్పందించడం మరింత సులభమవుతుంది.