Khalistan: ఖలిస్తానీ టెర్రరిస్టును హత్యకు కుట్ర.. భారత్‌కు అమెరికా కోర్టు సమన్లు
ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ తన హత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ సివిల్ దావా వేసిన నేపధ్యంలో, అమెరికా కోర్టు భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేసింది. సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ సమన్లలో భారత ప్రభుత్వంతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, R&AW మాజీ చీఫ్ సమంత్ గోయెల్, RAW ఏజెంట్ విక్రమ్ యాదవ్, భారతీయ వ్యాపారవేత్త నిఖిల్ గుప్తాల పేర్లను పొందుపర్చింది. ఈ నోటీసుల్లో పేరున్న వారందరూ 21 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని యుఎస్ న్యాయస్థానం కోరింది. అయితే, ఈ సమన్లపై ఇప్పటి వరకు కేంద్రం స్పందించలేదు.
యుఎస్ కోర్టులో పన్నూన్ పిటిషన్ దాఖలు
గత ఏడాది నవంబరులో, సిక్కులు ఫర్ జస్టిస్ అనే రాడికల్ సంస్థకు నాయకత్వం వహిస్తున్న యుఎస్-కెనడా ద్వంద్వ పౌరసత్వం కలిగిన ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను చంపడానికి జరిగిన కుట్రను యుఎస్ పోలీసులు భగ్నం చేశారు. ఈ కుట్రలో ఒక భారతీయ అధికారికి లింక్ ఉందని యుఎస్ కోర్టులో పన్నూన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇది ప్రభుత్వ విధానానికి విరుద్ధమని అప్పటి MEA ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు. ఈ ఏడాది మేలో, అమెరికాలో పర్యటించిన భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈ అంశంపై దర్యాప్తు కొనసాగుతుందని, ఇది భారత్-యుఎస్ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపదని పేర్కొన్నారు.