Page Loader
Air India Crash: బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌ 787-8 విమానాలను నిలిపివేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం 
బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌ 787-8 విమానాలను నిలిపివేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం

Air India Crash: బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌ 787-8 విమానాలను నిలిపివేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 13, 2025
03:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

అహ్మదాబాద్‌ ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 (Boeing Dreamliner 787-8)విమానాల సేవలను తాత్కాలికంగా నిలిపివేసే యోచనపై కేంద్రం ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.తదుపరి ప్రక్రియలో మొదటగా ఈ విమానాల సేవలు తాత్కాలికంగా నిలిపివేసిన తర్వాత భద్రతా అంశాలపై సమగ్రంగా సమీక్ష జరిపే యోచన ఉంది. భద్రతా సమీక్ష ముగిసిన అనంతరం,ఈ విమానాల సేవలను పూర్తిగా నిలిపివేయాలా లేక మళ్లీ కొనసాగించాలా అనే అంశంపై తుదినిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలో భారత్‌,అమెరికాలోని సంబంధిత విమాన భద్రతా సంస్థల మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయి.

వివరాలు 

ఎయిర్ ఇండియాతో పాటు,ఇతర విమానయాన సంస్థలకు నోటీసులు జారీ చేసే అవకాశం 

అంతేకాకుండా, తాజా ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తు పూర్తయిన తరువాతే కేంద్రం స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశముందని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఇక ఎయిర్ ఇండియాతో పాటు,ఇతర విమానయాన సంస్థల నిర్వహణ విధానాలపై కూడా కేంద్రం దృష్టిసారించనుండగా, వీరికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ఘోర విమాన ప్రమాదంలో 265 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటన, దేశంలో గగనతల భద్రతపై తీవ్రంగా చర్చలు మొదలయ్యేలా చేసింది. సాధారణంగా బోయింగ్ విమానాలను టెక్నాలజీ, భద్రత, వేగం, ఇంధన సామర్థ్యం పరంగా అత్యుత్తమంగా భావిస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ విమాన తయారీ సంస్థలతో పోల్చినపుడు, బోయింగ్‌ విమానాలు ఆధునికమైనవిగా పేరుగాంచినవి.

వివరాలు 

అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థలు ఈ విమానం సొంతం 

కానీ, అహ్మదాబాద్‌ దుర్ఘటన తర్వాత బోయింగ్‌ విమానాల భద్రతపై సందేహాలు మొదలయ్యాయి. బోయింగ్‌ డ్రీమ్‌లైనర్ 787-8 విమాన శరీర నిర్మాణంలో 50 శాతం కంటే ఎక్కువ భాగాన్ని కార్బన్‌ ఫైబర్‌ కలయికలతో తయారు చేస్తారు. ఇది స్టీల్‌తో పోల్చితే ఎక్కువ బలమైనదిగా ఉండగా, అల్యూమినియంతో పోల్చితే తేలికగా ఉంటుంది. ఈ తత్వాల వలన ఈ విమానం ఇంధనాన్ని ఎక్కువగా ఆదా చేయగలదు. పర్యావరణ హితం కావడమే దీనికి మరొక ప్రత్యేకత. అంతేకాకుండా, అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థలు ఈ విమానంలో ఉండటం వలన ఇది మరింత అభివృద్ధి చెందినదిగా గుర్తించబడుతోంది.