
India-Pakistan: మన మార్కెట్లో తమ వస్తువులను విక్రయించుకునేందుకు పాక్ కుటిలయత్నాలు.. భారత్ హైఅలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై భారత్ పూర్తిస్థాయిలో నిషేధం విధించిన విషయం తెలిసిందే.
అయితే, ఈ నిషేధాన్ని దాటి తమ ఉత్పత్తులను భారత మార్కెట్లోకి చొప్పించేందుకు పాకిస్థాన్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సింగపూర్, ఇండోనేషియా, శ్రీలంక వంటి దేశాల ద్వారా తమ ఉత్పత్తులను భారత్‌కు చేరేలా వ్యూహాత్మకంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.
దీంతో భారత కస్టమ్స్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని ఆధారంగా చేసుకుని పలు ఆంగ్ల మీడియా సంస్థలు ఈ విషయాన్ని నివేదించాయి.
వివరాలు
500 మిలియన్ డాలర్ల విలువైన పాకిస్థానీ ఉత్పత్తులు
దాదాపు 500 మిలియన్ డాలర్ల విలువైన పాకిస్థానీ ఉత్పత్తులు.. ఉదాహరణకు పండ్లు, ఎండు ఖర్జూరాలు, వస్త్రాలు, రాక్ సాల్ట్, చర్మ సంబంధిత వస్తువులు.. ఇవన్నీ మూడవ దేశాల్లో లేబుల్స్ మార్చి, ప్యాకేజింగ్ రూపాన్ని మార్చి భారత్‌కు ఎగుమతి చేసే యత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
ఈ ఉత్పత్తులను భారత మార్కెట్లోకి పంపేందుకు ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది.
దీనిని దృష్టిలో ఉంచుకుని కస్టమ్స్ అధికారులు ఈ రకాల దిగుమతులపై ప్రత్యేక నిఘా ఉంచారు.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, పాకిస్థాన్‌లో తయారు అయ్యే ఏ వస్తువైనా భారత్‌లోకి ప్రవేశించకుండా నిరోధించేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
వివరాలు
పాకిస్థాన్ నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే వస్తువుల విలువ చాలా తక్కువ
సాధారణంగా, అధికారిక మార్గాల్లో పాకిస్థాన్ నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే వస్తువుల విలువ చాలా తక్కువగా ఉంటుంది.
అయితే, మూడో దేశాల ద్వారా పాక్ ఉత్పత్తులు భారత్‌కు చేరుతున్నాయని అధికారులు గుర్తించారు.
ఈ పరిస్థితిని అరికట్టే నిమిత్తంగా ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ పాకిస్థాన్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం మే 2న ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటికే 2019లో పుల్వామా ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్ పాకిస్థాన్ నుంచి దిగుమతులను గణనీయంగా తగ్గించింది.
వివరాలు
భారత్ నుంచి పాకిస్థాన్‌కు 447.65 మిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి
అదే సమయంలో 'మోస్ట్ ఫేవర్డ్ నేషన్' హోదాను ఉపసంహరించడమే కాకుండా, ఆ దేశ ఉత్పత్తులపై 200 శాతం దిగుమతి సుంకాన్ని విధించింది.
గణాంకాలను పరిశీలిస్తే, 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి పాకిస్థాన్‌కు 447.65 మిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి చేయగా, అక్కడి నుంచి కేవలం 0.42 మిలియన్ డాలర్ల ఉత్పత్తులనే దిగుమతి చేసుకుంది.
మొత్తంగా, ఈ వాణిజ్యం విలువ పరంగా తక్కువగా ఉన్నప్పటికీ, పాకిస్థాన్‌లోని కొన్ని పరిశ్రమలు మాత్రం భారత్ మార్కెట్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి.
కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల ఆ పరిశ్రమలు ఆర్థికంగా తీవ్రమైన ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది.