PM Modi: ఆటో పరిశ్రమ అభివృద్ధిలో దేశం కీలక పాత్ర.. భారత్ మొబిలిటీ ఎక్స్ పో లో ప్రధాని
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విస్తరణ కోసం ప్రభుత్వం పలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీతెలిపారు.
రతన్ టాటా, ఒసాము సుజుకీ వంటి దిగ్గజ వ్యాపారవేత్తలు భారత ఆటోమొబైల్ రంగ అభివృద్ధికి, మధ్యతరగతి ప్రజల కలలు సాకారం చేసేందుకు విశేష సహకారం అందించారని అన్నారు.
భారత్ పెట్టుబడులకు స్వర్గధామమని, మొబిలిటీ రంగంలో తమ భవిష్యత్తు నిర్మించుకోవాలని కోరుకునే ప్రతి పెట్టుబడిదారుడికి ఇది ఉత్తమ గమ్యస్థానంగా ఉంటుందని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ 'భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025'ను ప్రారంభించారు.
భారతదేశం గ్రీన్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ),హైడ్రోజన్ ఇంధనం,జీవ ఇంధనాల అభివృద్ధిపై దృష్టిసారించిందని చెప్పారు.
వివరాలు
ఫ్రేమ్-2 పథకం కింద గత 5 ఏళ్లలో రూ. 8000 కోట్లకుపైగా సబ్సిడీ
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం దేశంలో ఆటో పరిశ్రమ అభివృద్ధికి కీలక పాత్ర పోషించిందని, ఈ దశాబ్దం చివరికి ఈవీ అమ్మకాలు ఎనిమిది రెట్లు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.
ఫ్రేమ్-2 పథకం కింద గత 5 ఏళ్లలో రూ. 8000 కోట్లకుపైగా సబ్సిడీగా మంజూరు చేశామని, ఈ పథకం ద్వారా 16 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించామని వివరించారు.
దిల్లీలో 1200 కంటే ఎక్కువ ఈవీ బస్సులు నడుస్తున్నాయన్నారు.
గతంలో రోడ్ల లోపం కారణంగా ప్రజలు కార్లు కొనుగోలు చేయడం నిరాకరించేవారని, ఇప్పుడు పరిస్థితి మారడంతో కార్లకు డిమాండ్ పెరుగుతోందని చెప్పారు.
ప్రస్తుతం సంవత్సరానికి సుమారు 2.5 కోట్ల కార్లు విక్రయమవుతున్నాయని తెలిపారు.
వివరాలు
దేశవ్యాప్తంగా అనేక ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు
మధ్యతరగతి వర్గం పెరుగుతుండటంతో పాటు వేగవంతమైన పట్టణీకరణ, సరసమైన వాహనాలు భారత ఆటో మొబైల్ రంగానికి మద్దతు ఇస్తున్నాయని పేర్కొన్నారు.
దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడిన తరువాత, వీరు వాహనాలను కొనుగోలు చేయాలని ఆసక్తి చూపుతున్నారని ప్రధాని తెలిపారు.
ఈవీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా అనేక ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశామని వివరించారు.
దేశ రాజధానిలోని భారత మండపంలో ప్రారంభమైన 'భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025' ఈ నెల 22 వరకు కొనసాగుతుందని తెలిపారు.
యశోభూమి, గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్ & మార్ట్ వేదికలలో ఈ ఎక్స్‌పో నిర్వహించబడుతుందని నిర్వాహకులు వెల్లడించారు.