LOADING...
First Bullet Train: భారత్ తొలి బుల్లెట్‌ ట్రైన్‌ డిజైన్‌ విడుదల
భారత్ తొలి బుల్లెట్‌ ట్రైన్‌ డిజైన్‌ విడుదల

First Bullet Train: భారత్ తొలి బుల్లెట్‌ ట్రైన్‌ డిజైన్‌ విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
May 18, 2026
06:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో తొలి బుల్లెట్‌ ట్రైన్‌కు సంబంధించిన డిజైన్‌ను భారతీయ రైల్వే శాఖ విడుదల చేసింది. ముంబై-అహ్మదాబాద్‌ మధ్య నడిచే ఈ హైస్పీడ్‌ రైలు నమూనాను న్యూఢిల్లీలోని రైల్వే మంత్రిత్వ శాఖ గేట్‌ నంబర్‌-4 వద్ద ప్రదర్శనకు ఉంచారు. మొత్తం 508 కిలోమీటర్ల పొడవుతో నిర్మితమవుతున్న ముంబై-అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టు మహారాష్ట్ర,గుజరాత్‌,దాద్రా నగర్‌ హవేలీ ప్రాంతాల మీదుగా సాగనుంది. ఈ ప్రాజెక్టులో ముంబై,థానే,విరార్‌,బోయిసర్‌,వాపి,బిల్లిమోరా,సూరత్‌,భరూచ్‌,వడోదర,ఆనంద్‌, అహ్మదాబాద్‌, సబర్మతి కలిపి మొత్తం 12 స్టేషన్లు ఉండనున్నాయి. గుజరాత్‌లోని వాపి, బిల్లిమోరా, సూరత్‌, భరూచ్‌, ఆనంద్‌, వడోదర, అహ్మదాబాద్‌, సబర్మతి స్టేషన్లలో ఫౌండేషన్‌ పనులు పూర్తయ్యాయి. మహారాష్ట్రలో థానే, విరార్‌, బోయిసర్‌ ప్రాంతాల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ స్టేషన్‌లో తవ్వకాలు దాదాపు పూర్తికావొచ్చాయి.

వివరాలు 

91 శాతం పనులు పూర్తి 

ప్రాజెక్టులో భాగంగా 17 నదులపై వంతెనల నిర్మాణం పూర్తయ్యింది. గుజరాత్‌లో నర్మదా, మహి, తప్తి, సబర్మతి నదులపై కీలక వంతెనల పనులు వేగంగా సాగుతున్నాయి. మహారాష్ట్రలో మరో నాలుగు నదులపై బ్రిడ్జిల నిర్మాణం కొనసాగుతోంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ ప్రాంతంలో తవ్వకాల పనులు 91 శాతం పూర్తయ్యాయి. అలాగే ఘాన్సోలి-శిల్ఫటా మధ్య సముద్రం అడుగుభాగంలో నిర్మిస్తున్న సొరంగ మార్గంలో ఇప్పటికే 4.8 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి.

వివరాలు 

రెండు గంటలు తగ్గనున్న ముంబై-అహ్మదాబాద్‌ ప్రయాణ సమయం  

'మేక్‌ ఇన్‌ ఇండియా' కార్యక్రమంలో భాగంగా స్వదేశీ హైస్పీడ్‌ రైలు సాంకేతికతను అభివృద్ధి చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా రైల్వే శాఖ తెలిపింది. చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ICF), బెంగళూరులోని బీఈఎంఎల్‌ సంస్థలు కలిసి గంటకు 280 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రైలు సెట్లను తయారు చేస్తున్నాయి. ముంబై-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ ట్రైన్‌ సేవలను 2027 ఆగస్టు 15న ప్రారంభించే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయి. ఈ రైలు అందుబాటులోకి వస్తే ముంబై-అహ్మదాబాద్‌ మధ్య ప్రయాణ సమయం సుమారు రెండు గంటలకు తగ్గనుంది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బుల్లెట్‌ ట్రైన్‌ ఫస్ట్ లుక్ 

Advertisement