
India-Pakistan: పాకిస్థాన్‌కు భారత్ షాక్.. అన్ని మెయిల్స్, పార్సిళ్ల నిలిపివేత
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారతదేశం, పాకిస్తాన్‌పై దౌత్య, వాణిజ్య రంగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ పరిణామాల మధ్య పాక్‌కు మరో భారీ దెబ్బే తగిలింది.
ఆ దేశం నుంచి వాయు మార్గం, ఉపరితల మార్గాల ద్వారా భారత్‌కు వచ్చే అన్ని రకాల మెయిల్స్, పార్సిళ్ల మార్పిడిని నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ఇప్పటికే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాకిస్థాన్ నుంచి వస్తున్న అన్ని రకాల దిగుమతులపై నిషేధం విధించిన నేపథ్యంలో ఈ తాజా చర్య తీసుకుంది.
ఈ క్రమంలో పాక్‌తో ఉన్న సముద్ర రవాణా మార్గాలనూ భారత్ పూర్తిగా మూసేసింది. పాకిస్తాన్ జెండాతో నడుస్తున్న ఓడలు ఇకపై భారతదేశ పోర్టుల్లోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది.
Details
భారత్ జెండాలు ఉన్న ఓడలు పాకిస్థాన్ లోకి వెళ్లకూడదు
ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. అంతేకాకుండా భారత జెండాతో ఉన్న ఓడలు కూడా పాకిస్థాన్ పోర్టులకు వెళ్లకూడదని స్పష్టం చేసింది.
ఇప్పటికే పాకిస్థాన్ విమానాలకు భారత గగనతలాన్ని మూసివేసిన సంగతి విదితమే. ఇదే సమయంలో, ఎలక్ట్రానిక్స్, ఈ-కామర్స్‌కు సంబంధించిన వస్తువుల ఎగుమతిపై పరిమితులు విధించాలని భారత్ యోచిస్తోంది.
వీటి మీద కఠిన ఆంక్షలు విధించే అంశంపై కేంద్రం ప్రాథమికంగా చర్చలు ప్రారంభించినట్లు సమాచారం.
ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు అమానుషంగా హత్య చేయడంతో ఈ చర్యలకు కేంద్రం పూనుకుంది.
Details
మొదట సింధూ జలాల ఒప్పందం నిలిపివేత
మొదటగా సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడమే కాకుండా, పాకిస్థాన్ పౌరులు తక్షణమే భారత్‌ను విడిచిపెట్టాలని ఆదేశించింది. దాయాది దేశంపై ఆర్థికపరంగా ఒత్తిడి తెచ్చేలా నడుస్తోంది.
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) గ్రే లిస్టులో మళ్లీ పాక్‌ను చేర్చించేందుకు భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది
. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) పాక్‌కు ప్రకటించిన సహాయ ప్యాకేజీపై ఒత్తిడి పెంచడం ద్వారా ఆర్థికంగా ఒళ్ళు దులిపేలా చూస్తోంది.
ఈ రెండు ప్రయత్నాలు ఫలిస్తే పాకిస్థాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని వ్యాసకులు అభిప్రాయపడుతున్నారు.