Page Loader
India-Pakistan: కశ్మీర్‌పై పాక్‌ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలకు.. భారత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్
కశ్మీర్‌పై పాక్‌ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలకు.. భారత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్

India-Pakistan: కశ్మీర్‌పై పాక్‌ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలకు.. భారత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 17, 2025
05:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

కశ్మీర్‌ అంశంపై పాకిస్థాన్‌ సైన్యాధిపతి అసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్రమైన ప్రతిస్పందనను వ్యక్తం చేసింది. కశ్మీర్‌పై పాక్‌కు ఏ మాత్రం హక్కు లేదని,చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భూభాగాన్ని వదిలిపెట్టడమే దానికి ఉన్న ఏకైక సంబంధమని భారత విదేశాంగ శాఖ తేల్చిచెప్పింది. ''భారత దేశానికి చెందిన భూమిని ఎవరు తమ జీవనాడిగా భావించగలరు..?కశ్మీర్‌ భారతదేశానికి అవిభాజ్య భాగం''అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఇస్లామాబాద్‌లో నిర్వహించిన ఓకార్యక్రమంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మాట్లాడుతూ, ''కశ్మీర్ విషయంలో మా స్థిరమైన వైఖరే కొనసాగుతుంది.ఆ భూభాగం మా జీవిత ధార.దానిని మేం మరచిపోలేం''అని వ్యాఖ్యానించారు. ఈవ్యాఖ్యల నేపథ్యంలో భారత్‌ స్పందిస్తూ తన అధికారిక స్థితిని స్పష్టంగా వినిపించింది.

వివరాలు 

పాక్ ఉగ్రవాద కార్యకలాపాలకు వేదిక

ఇప్పటికే కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాక్ ఆక్రమిత కశ్మీర్‌ లేకుండా జమ్మూకశ్మీర్‌ అసంపూర్ణమని అభిప్రాయపడిన విషయం తెలిసిందే. పీఓకే ప్రాంతంలో పాకిస్థాన్ ఉగ్రవాద శిక్షణ శిబిరాలను నడుపుతోందని ఆయన ఆరోపించారు. పీఓకే భారత దేశానికి చెందని విదేశీ భూభాగంగా మాత్రమే పరిగణించబడుతుందని స్పష్టం చేశారు. అందుకే ఆ ప్రాంతాన్ని పాక్ ఉగ్రవాద కార్యకలాపాలకు వేదికగా మార్చిందని విమర్శించారు. ఇటీవల ఐక్యరాజ్య సమితి వేదికపై కూడా భారత్ ఇదే అంశాన్ని తిరిగి గుర్తుచేసింది. శాంతి పరిరక్షణ సంస్కరణలపై జరుగుతున్న చర్చల సందర్భంగా జమ్మూకశ్మీర్‌ గురించి పాక్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలపై భారత్ గట్టిగా స్పందించింది.

వివరాలు 

ఆ భూభాగాన్ని ఖాళీ చేయాల్సిన బాధ్యత పాక్‌దే..

''భారతదేశ కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌పై పాకిస్థాన్ తరఫున ప్రతినిధి మరోసారి అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు తరచూ చేస్తే చట్టవిరుద్ధ వాదనలు నిజం కావు. ఇటువంటి ప్రకటనల ద్వారా వారు ప్రోత్సహిస్తున్న సరిహద్దు ఉగ్రవాదాన్ని మేం ఎప్పటికీ సమర్థించలేము. జమ్మూకశ్మీర్‌ అనేది గతంలోను, ఇప్పటికీ, భవిష్యత్తులోను భారతదేశానికి అవిభాజ్య భాగంగా ఉంటుంది. ఆ ప్రాంతంలోని కొంత భాగం పాకిస్థాన్ ఆక్రమణలో ఉంది. ఆ భూభాగాన్ని ఖాళీ చేయాల్సిన బాధ్యత పాక్‌దే'' అని ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్‌ అన్నారు.

వివరాలు 

పాకిస్థాన్‌ - ఉగ్రవాదానికి మరో పేరు 

''పాకిస్థాన్‌ ప్రపంచంలో ఉగ్రవాదానికి కేంద్రంగా మారిన దురదృష్టకర ఖ్యాతిని ఇప్పటికీ మోస్తోంది. ఆ దేశం ఎంత ప్రయత్నించినా ఆ ముద్ర పోదు. ఉగ్రవాదులకు పాక్ ఇప్పటికీ ఆశ్రయం ఇస్తోంది. ముంబయి ఉగ్రదాడులకు కుట్రపన్నిన తహవ్వుర్ రాణా దొరకకుండా ఉండటం ఇందుకు నిదర్శనం'' అని విదేశాంగ ప్రతినిధి జైస్వాల్ అన్నారు. అలాగే ఆర్థిక నేరగాడు మెహుల్ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్టు చేసిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ''మన అప్పగింత అభ్యర్థన మేరకు బెల్జియం అధికారులు ఛోక్సీని అరెస్టు చేశారు. అతడిని భారత్‌కు రప్పించేందుకు అక్కడి ప్రభుత్వంతో మేం సమన్వయం చేసుకుంటున్నాం'' అని జైస్వాల్ వెల్లడించారు.