
India -Pak: పాక్‌పై భారత్ మండిపాటు.. ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచానికి తెలుసు..
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశం పొరుగుదేశాల్లో అస్థిరత కలిగించే ప్రయత్నాలు చేస్తోందని పాకిస్థాన్ మరోసారి న్యూదిల్లీపై ఆరోపణలు చేసింది.
దీనిపై భారత విదేశాంగశాఖ తీవ్రంగా స్పందించింది. పాక్ చేస్తున్న నిరాధార ఆరోపణలను తాము ఖండిస్తున్నామని పేర్కొంది.
ఉగ్రవాదానికి మూల కేంద్రం ఎక్కడుందో ప్రపంచం మొత్తం తెలుసునని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.
ఇతర దేశాలను నిందించకుండా, తమ అంతర్గత సమస్యలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.
వివరాలు
భారత్‌పై తీవ్ర ఆరోపణలు
బలోచిస్థాన్‌లో జరిగిన రైలు హైజాక్ ఘటనపై స్పందించిన పాక్ విదేశాంగ ప్రతినిధి షఫ్‌ఖత్ అలీఖాన్ గురువారం మీడియాతో మాట్లాడుతూ, భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.
భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, తమ దేశాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు.
పొరుగుదేశాల్లో అస్థిరతకు కారణమవుతూనే, ప్రపంచవ్యాప్తంగా హత్యాకాండకు పాల్పడుతోందని తెలిపారు.
గతంలో బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) నిర్వహించిన దాడులకు భారత్ మద్దతుగా ఉందని పేర్కొన్నారు.
అయితే, ఇప్పుడు పాక్ విదేశాంగ విధానంలో ఏమైనా మార్పు ఉందా? అనే మీడియా ప్రశ్నకు షఫ్‌ఖత్ అలీఖాన్ స్పందిస్తూ, ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.
వివరాలు
33 మంది మృతి
''భారత మీడియా బీఎల్‌ఏను ఒక విధంగా పొగుడుతోంది. ఇది అధికారికంగా కాకపోయినా, ఆ దేశ విధానాన్ని ప్రతిబింబించేలా ఉంది'' అని ఆయన అన్నారు.
క్వెట్టా నుంచి పెషావర్‌కు 425 మంది ప్రయాణికులతో వెళుతున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను మంగళవారం బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) వేర్పాటువాదులు బోలన్ ప్రాంతంలో హైజాక్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనలో వేర్పాటువాద మిలిటెంట్లు 33 మందిని హతమార్చినట్లు పాకిస్థాన్ సైన్యం వెల్లడించింది.
వివరాలు
ఇతర దేశాలపై నిందలు వేయడం మానుకోవాలి: అఫ్గానిస్థాన్
రైలు హైజాక్ ఘటన వెనుక అఫ్గానిస్థాన్ హస్తం ఉందని పాక్ చేసిన ఆరోపణలను అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఖండించింది.
ఈ ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంది. పాక్ బాధ్యతారహిత ఆరోపణలు, వారి దిగజారుడు విధానాన్ని సూచిస్తున్నాయని విమర్శించింది.
తమ దేశ సమస్యలను పరిష్కరించుకోలేని పాక్, ఇతర దేశాలపై నిందలు వేయడం మానుకోవాలని హితవు పలికింది.