Bharat Antariksha Station: భారత్ 2035 నాటికి భారత్ అంతరిక్ష స్టేషన్‌ను నిర్మిస్తుంది: జితేంద్ర సింగ్
భారతదేశం 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పని చేస్తున్నట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఆయన 2040 నాటికి భారతీయుడు చంద్రుడిపై కాలుమోపే అవకాశం ఉందని కూడా చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరిక్ష మంత్రిత్వశాఖలు ఈ ఏడాది చేపట్టిన కీలక కార్యక్రమాల గురించి విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, ''భారతదేశం సొంత స్పేస్ స్టేషన్‌ను 2035 నాటికి సిద్ధం చేసుకుంటుంది. ఇది అమెరికా వంటి దేశాల తరహాలో అనేక అంతరిక్ష కేంద్రాలున్న దేశాల సరసన నిలబడేలా చేస్తుంది'' అన్నారు. ఆయన భారతదేశం మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర ''గగన్‌యాన్ మిషన్'' గురించి కూడా వివరించారు.
భారత్ చేపడుతున్న తొలి మానవ సహిత డీప్ ఓషన్ మిషన్ సముద్రయాన్
2024 చివరికి లేదా 2026 ప్రారంభంలో మొదటి భారతీయ వ్యోమగామి గగన్‌యాన్ మిషన్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతారని చెప్పారు. ఈ సందర్భంగా, జితేంద్రసింగ్ భారత్ చేపడుతున్న తొలి మానవ సహిత డీప్ ఓషన్ మిషన్ ''సముద్రయాన్'' గురించి కూడా మాట్లాడారు. సముద్రయాన్‌లో భాగంగా, మత్స్య-6000 జలాంతర్గామిని రూపొందించారు, దీని ద్వారా ముగ్గురు వ్యక్తులు 6 కిలోమీటర్ల (6,000 మీటర్ల) సముద్రపు గరిష్ట లోతుకు చేరుకోవచ్చు. దీని ద్వారా సముద్ర వనరులు, జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేయవచ్చని తెలిపారు.
భారతదేశం మొట్టమొదటి మానవ సహిత సముద్ర అన్వేషణ
ఈ జలాంతర్గామి చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) అభివృద్ధి చేస్తున్నది. సముద్ర అన్వేషణలో దోహదపడే ఈ మిషన్ భారతదేశం మొట్టమొదటి మానవ సహిత సముద్ర అన్వేషణగా గుర్తింపబడుతుంది. జితేంద్రసింగ్ ప్రస్తుతం భారతదేశం ఉపగ్రహ ప్రయోగాలలో విశేష పురోగతి సాధించిందని చెప్పారు. ఇప్పటివరకు శ్రీహరికోట నుంచి 432 విదేశీ ఉపగ్రహాలు ప్రయోగించాయని, వాటిలో 397 (90 శాతం) గత దశాబ్దంలోనే ప్రయోగించామన్నారు.