
Rammohan Naidu: భారతదేశానికి 30,000 మంది పైలట్లు అవసరం: రామ్మోహన్ నాయుడు
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోంది. ప్రయాణికుల సంఖ్య సంవత్సరానికోసారి పెరుగుతుండటంతో, ఆయా సంస్థలు విమానాలను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో, రాబోయే కాలంలో పైలట్ల అవసరం భారీగా పెరుగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
రాబోయే 15-20 ఏళ్లలో దాదాపు 30,000 పైలట్లు అవసరమవుతారని తెలిపారు. 200 శిక్షణ విమానాల కొనుగోలుకు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
వివరాలు
1,700కు పైగా కొత్త విమానాలకు ఆర్డర్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 800కు పైగా విమానాలు సేవలందిస్తున్నాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ప్రస్తుతం 6,000 నుండి 7,000 మంది పైలట్లు పనిచేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే వివిధ సంస్థలు 1,700కు పైగా కొత్త విమానాలకు ఆర్డర్ ఇచ్చాయని పేర్కొన్నారు.
రాబోయే కాలంలో అవి సేవలందించనున్నాయని వివరించారు. దీని ప్రభావంగా, వచ్చే 15-20 ఏళ్లలో 30,000 పైలట్లు అవసరమవుతారని చెప్పారు.
భారత్‌ను పైలట్ శిక్షణ హబ్‌గా మార్చే లక్ష్యంతో పని చేస్తున్నట్లు వెల్లడించారు.
విమానయాన రంగ అభివృద్ధి కోసం మంత్రిత్వ శాఖ సమగ్ర వ్యూహంతో ముందుకు సాగుతోందని తెలిపారు.
38 ఫ్లయింగ్ ట్రైనింగ్ సంస్థలను పరిశీలించి, వాటికి అధికారుల ద్వారా రేటింగ్ ఇవ్వనున్నట్లు ఆయన తెలియజేశారు.