Bomb Threats: ఈ ఏడాది ఇండియన్ ఎయిర్‌లైన్స్ లో 994 బాంబు బెదిరింపులు: విమానయాన మంత్రి
ఇటీవల భారతదేశంలోని పలు విమానయాన సంస్థలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఈ విషయంపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ 2024లో ఇప్పటివరకు భారత విమానయాన సంస్థలకు 994 బూటకపు బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలిపారు. 2022 నుంచి 2024 నవంబర్ 13 వరకు మొత్తం 1,143 బెదిరింపులు నమోదు అయినట్లు కూడా వెల్లడించారు. ఈ బెదిరింపుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
బాంబు థ్రెట్ అసెస్‌మెంట్ కమిటీ ఏర్పాటు
అయితే, ఈ బెదిరింపులకు సంబంధించి లొకేషన్ సమాచారం సరిగ్గా అందకపోవడం వల్ల దర్యాప్తు ఆలస్యం అవుతోందని ఆయన తెలిపారు. ఈ రకమైన బెదిరింపులను అరికట్టేందుకు పౌర విమానయాన భద్రత మండలి(BCAS),ఏవియేషన్ సెక్యూరిటీ రెగ్యులేటర్ ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అందులో భాగంగా,బాంబు బెదిరింపులపై దర్యాప్తు కోసం బాంబు థ్రెట్ అసెస్‌మెంట్ కమిటీ(BTAC)ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇటీవల,భారతదేశంలోని విస్తారా,ఎయిరిండియా,ఇండిగో, ఆకాశ ఎయిర్, స్పైస్‌జెట్, స్టార్‌ఎయిర్, అలయన్స్ ఎయిర్ వంటి ప్రముఖ విమానయాన సంస్థలకు వరుసగా బూటకపు బాంబు బెదిరింపులు రావడంతో ప్రయాణికులు,ఎయిర్‌లైన్స్ సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో,కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ సామాజిక మాధ్యమ వేదికలకు మార్గదర్శకాలను జారీ చేసింది. బూటకపు బెదిరింపులకు పాల్పడిన పలువురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.