
భారత వాతావరణ అంచనా వ్యవస్థలు ప్రపంచంలోనే భేష్ : కిరణ్ రిజిజు
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలోని వాతావరణ అంచనా వ్యవస్థలు భేషుగ్గా ఉన్నట్లు కేంద్ర భూవిజ్ఞాన శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని వ్యవస్థల కంటే భారత్ లోని వ్యవస్థలు పటిష్టంగా ఉన్నాయని ఆయన తెలిపారు.
ఈ మేరకు గత కొన్నాళ్లుగా కచ్చితమైన సమాచారాన్ని అంచనా వేస్తున్నాయని చెప్పుకొచ్చారు. వాతావరణ మార్పుల దృష్ట్యా భారత వాతావరణ శాఖ పాత్ర కీలకంగా మారిందని దిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు.
గత కొద్ది సంవత్సరాలుగా భారతీయ వాతావరణ అంచనా వ్యవస్థల(INDIAN WEATHER FORECASTING STATIONS) ఫలితాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని వ్యవస్థల కంటే మెరుగ్గా ఉన్నాయని వివరించారు.
ఈ నేపథ్యంలోనే ఐఎండీ జారీ చేసిన హెచ్చరికలను, సూచనలను పాటించడం అంటే తీవ్రతను తగ్గించుకోవడమేనన్నారు.
DETAILS
వచ్చే 3 ఏళ్లలో డాప్లర్ రాడర్ల సంఖ్య దాదాపుగా 68కి పెంచుతాం : కేంద్ర భూవిజ్ఞాన శాఖ
భారత వాతావరణంలో చోటు చేసుకునే మార్పులను కచ్చితంగా అంచనా వేయడంలో డాప్లర్ రాడర్లు కీలక పాత్రను పోషిస్తాయి. అయితే వాటి సంఖ్యను రెట్టింపు చేస్తామని రిరిజు ప్రకటించారు.
ప్రస్తుతం 35గా ఉన్న డాప్లర్ రాడర్ల సంఖ్యను వచ్చే 3 ఏళ్లలో దాదాపుగా 68కి పెంచనున్నామని స్పష్టం చేశారు. 2014 నుంచి భారత వాతావరణ కేంద్రం (IMD - India Meteorological Department) అద్భుతంగా పని చేస్తోందని ఆయన కితాబిచ్చారు.
ఈ మేరకు గుజరాత్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన బిపర్ జాయ్ వంటి తుపానులను కచ్చితంగా పసిగట్టిందంటూ కీర్తించారు. ఈ సందర్భాంగానే ప్రపంచంలోనే భారత వాతావరణం అంచనా వ్యవస్థలు కచ్చితమైన సమాచారాన్ని ఇస్తున్నాయని రిరిజు తేల్చి చెప్పారు.