
Kolkata airport: కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు.. హైఅలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో,కోల్‌కతాలో ఉన్న 'నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది.
ఈ హెచ్చరిక నేపథ్యంలో విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
కోల్‌కతా నుండి ముంబయికి బయల్దేరబోయే ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు.
అక్కడికి కొద్ది నిమిషాల్లోనే ఆ విమానం టేకాఫ్ కావాల్సి ఉంది.. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమై విమానంలోని ప్రయాణికులు, వారి లగేజీని కిందకు దింపించారు.
అనంతరం విమానాన్ని 'ఐసోలేషన్ బే'లోకి తరలించి పూర్తిస్థాయిలో తనిఖీ నిర్వహించారు.
తనిఖీల్లో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
వివరాలు
బాంబు బెదిరింపు కాల్ రావడంతో అధికారులు అత్యవసర చర్యలు
ఈ విమానం మధ్యాహ్నం 1:30 గంటలకు కోల్‌కతా నుండి బయలుదేరి, సాయంత్రం 4:20కి ముంబయి చేరాల్సి ఉండేది.
మొత్తం 195 మంది ప్రయాణికులు చెక్‌ఇన్ అయ్యాకే బాంబు బెదిరింపు కాల్ రావడంతో అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు.
వెంటనే అప్రమత్తతా ప్రకటనలు జారీచేసి, విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
బాంబు నిర్వీర్య బృందాలు, ఇతర రక్షణ బలగాలు విమానాశ్రయంలోని ప్రతి ప్రదేశాన్ని గాలించాయి. సీఐఎస్‌ఎఫ్ బలగాలు విమానాశ్రయ భద్రతను మరింత బలోపేతం చేశాయి.
వివరాలు
మే 6న కూడా ఇలాంటి ఘటన..
ఇటీవలి పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' అనంతరం, ఈ రకమైన బాంబు బెదిరింపులు నమోదవడం ఇది రెండోసారి.
మే 6న కూడా ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఛండీగఢ్ నుండి ముంబయి వెళ్లే ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్టు ఓ గుర్తు తెలియని వ్యక్తి ముంబయి విమానాశ్రయ అధికారులకు ఫోన్ చేసి బెదిరించాడు.
అయితే అనంతరం ఆ బెదిరింపు నిజంకాదని తేలింది.