Chennur: 'భూమి ఉన్నా లేకున్నా ఇందిరమ్మ కుటుంబ బీమా'.. పథకం ప్రారంభించిన మంత్రి వివేక్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని కార్మిక,మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి నవంబర్ 24,2026న మంచిర్యాల జిల్లాలో ప్రారంభించారు. చెన్నూరు మండలం గంగారం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పథకాన్ని ప్రారంభించిన ఆయన.. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం కుటుంబ బీమా సదుపాయాన్ని అందిస్తోందని తెలిపారు. పేద,బడుగు,బలహీన వర్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి వివరించారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ బీమా ఎంతో అండగా నిలుస్తుందని చెప్పారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వివరాలు
చెన్నూరులో త్వరలో బస్ డిపో, వంద పడకల ఆసుపత్రి
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నసమయంలో పేద,బలహీన వర్గాలకు ఇందిరమ్మ ఇళ్లు,భూములు పంపిణీ చేసినట్లు మంత్రి గుర్తు చేశారు.
ఆతర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని కేవలం 40లక్షల మందికే పరిమితం చేసిందని అన్నారు.
ప్రస్తుతం కోటి మందికి పైగా ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు.
గతంలో భూమి ఉన్నవారికి మాత్రమే బీమా సదుపాయం అందేదని,ఇప్పుడు భూమితో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా కల్పిస్తున్నామని వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.
గంగారం గ్రామ ప్రజలు కోరిన వెంటనే 25ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు.
త్వరలోనే చెన్నూరులో బస్ డిపోతో పాటు 100పడకల ఆసుపత్రిని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
వివరాలు
సన్న బియ్యం పంపిణీ కోసం రూ.25 కోట్లు
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం రూ.9 వేల కోట్లు ఖర్చు చేసిందని మంత్రి తెలిపారు.
సన్న బియ్యం పంపిణీ కోసం రూ.25 కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం అందించే పథకాన్ని కూడా అమలు చేస్తున్నామని గుర్తు చేశారు.
గంగారం గ్రామ అభివృద్ధి కోసం సుమారు రూ.50 లక్షల నిధులు మంజూరు చేసినట్లు వివరించారు.
వివరాలు
పుష్కరాల ఏర్పాట్ల కోసం రూ.70 కోట్ల నిధులతో పనులు
మంచిర్యాల జిల్లాలోని సోమనపల్లి గ్రామంలో రూ.250 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు.
పుష్కరాల ఏర్పాట్ల కోసం రూ.70 కోట్ల నిధులతో త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, స్థానిక ఎంపీడీవో అజ్మత్ అలీ, గ్రామ పంచాయతీ సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.