Rammohan Naidu : కడప, కర్నూలు జిల్లాలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు.. కేంద్రమంత్రి రామ్మోహన్
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, ఆ దిశగా ప్రస్తుతం అడుగులు వేస్తున్నామని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. బుధవారం దిల్లీలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. కడప జిల్లా కొప్పర్తిలోని పారిశ్రామిక హబ్ కింద 2,596 ఎకరాలను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఈ హబ్ విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ కింద వస్తుందన్నారు. దీని కోసం కేంద్రం రూ.2,137 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ఈ హబ్ ద్వారా 54,500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్ ద్వారా 45వేల మందికి జీవనోపాధి
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో మరో పారిశ్రామిక కారిడార్‌ను 2,621 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్రం రూ.2,786 కోట్లు చేస్తుందని, దీని ద్వారా 45,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ రెండు పారిశ్రామిక కారిడార్లకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర కేబినెట్ ఆమోదించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో కేంద్రం, రాష్ట్రం కలిసి కట్టుగా ముందుకెళ్తున్నాయన్నారు. ఈ విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు కోసం త్వరలోనే నిధులు
అనంతరం పోలవరం ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించారు. ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్రం త్వరలోనే రూ.12,000 కోట్లు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. నవంబరులో పోలవరం పనులు మళ్లీ ప్రారంభం కానున్నాయని, నిధులు కూడా త్వరలోనే విడుదలవుతాయని చెప్పారు. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ అనేక రంగాల్లో వెనుకబడిందని, డబుల్ ఇంజిన్ గ్రోత్ ద్వారా రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.