Page Loader
Influencer Arrest: ఇన్‌స్టాలో 13 లక్షల మంది ఫాలోవర్లు.. హనీట్రాప్‌ కేసులో సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అరెస్ట్ 
హనీట్రాప్‌ కేసులో సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అరెస్ట్

Influencer Arrest: ఇన్‌స్టాలో 13 లక్షల మంది ఫాలోవర్లు.. హనీట్రాప్‌ కేసులో సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అరెస్ట్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 19, 2025
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

హనీట్రాప్ కేసులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ను గుజరాత్‌లోని సూరత్ పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 10 నెలలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూ తిరుగుతోన్న ఆమెను, చివరకు సాంకేతిక సహాయంతో పోలీసులు పట్టుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 13 లక్షల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న కీర్తి పటేల్ అనే మహిళ, ఒక బిల్డర్‌ను హనీట్రాప్ చేసి, భారీగా డబ్బు వసూలు చేయాలని ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ కేసు సంబంధంగా గత సంవత్సరం జూన్ 2వ తేదీన కోర్టు ఆమెకు అరెస్టు వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచి ఆమె పరారీలో ఉంది.

వివరాలు 

సూరత్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సూరత్‌కు చెందిన కీర్తి పటేల్‌ స్థానికంగా ఉన్న ఓ బిల్డర్‌ను హనీట్రాప్ చేసి, అనంతరం బ్లాక్‌మెయిల్‌కు పాల్పడింది. కోట్లు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు దిగింది. దీంతో బాధిత బిల్డర్ పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసిన వారు ఇందులో నలుగురిని అరెస్టు చేశారు. అయితే ప్రధాన నిందితురాలైన కీర్తి అప్పటినుండి పరారీలో ఉంది. సూరత్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసిన తర్వాత పోలీసులు ఆమె కోసం గాలింపు ప్రారంభించారు. అయితే ఆమె ఎంతో తెలివిగా వ్యవహరించి,తన మొబైల్ ఫోన్ ఐపీ అడ్రస్‌లను,సిమ్ కార్డులను తరచూ మార్చుతూ పోలీసులకి దొరక్కుండా ఉండటానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఇలా గుజరాత్‌లోని పలు పట్టణాలకు మకాం మారుస్తూ దొరక్కుండా జాగ్రత్త పడింది.

వివరాలు 

కీర్తి పటేల్‌పై క్రిమినల్ కేసులు నమోదు 

అయితే చివరకు పోలీసులు సాంకేతిక నిఘా పెట్టి, అహ్మదాబాద్‌లోని సర్ఖేజ్ ప్రాంతంలో ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను సూరత్‌కు తరలించారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను డీసీపీ అలోక్ కుమార్ మీడియాతో పంచుకున్నారు. కీర్తి పటేల్‌పై భూకబ్జా, దోపిడీ వంటి మరిన్ని క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయని ఆయన తెలిపారు.