TS High Court: సింగరేణి ఎన్నికలపై వీడని ఉత్కంఠ.. హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్
సింగరేణి ఎన్నికల నిర్వహణపై విచారణ వాయిదా పడింది. ఎన్నికల వాయిదా కోరుతూ రాష్ట్ర ఇంధన శాఖ తెలంగాణ హైకోర్టును అశ్రయించింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ 21వ తేదీకి వాయిదా వేసింది. సింగరేణిలో నాలుగేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఈ సారి ఎన్నికలు ఇప్పటికే ఆలస్యమైన విషయం తెలిసిందే. అయితే డిసెంబర్ 27వ తేదీ నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదలై, ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే 27న జరిగే సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
మార్చిలో నిర్వహించాలన్న ఇంధన, వనరుల శాఖ
మార్చిలో ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ఇంధన, వనరుల శాఖ కోరింది. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో చెప్పారని హైకోర్టు గుర్తు చేసింది. ఈ మేరకు విచారణను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఇంధన, వనరుల శాఖ కార్యదర్శి పిటిషన్‌పై స్టే ఇవ్వకుండా హైకోర్టు విచారణ చేపట్టింది.