
హర్యానా: నుహ్‌లో రెండు వారాల తర్వాత ఇంటర్నెట్ పునరుద్ధరణ
ఈ వార్తాకథనం ఏంటి
రెండు వారాల క్రితం మత ఘర్షణలతో అట్టుడికిపోయిన హర్యానాలోని నుహ్ జిల్లాలో ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడుతున్నాయి.
తాజాగా అధికారులు ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించారు. కర్ఫ్యూను కూడా తాత్కాలికంగా ఎత్తివేశారు.
జూలై 31న రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత నుహ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘర్షణల్లో ఆరుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు.
దీంతో ప్రభుత్వం ఇంటర్నెట్, ఎస్ఎంఎస్, బ్రాడ్‌బ్యాండ్ సేవలను నిలిపేసింది.
వీహెచ్‌పీ నిర్వహించిన మతపరమైన ఊరేగింపును అడ్డుకునే ప్రయత్నంలో ఘర్షణ మొదలైంది.
నుహ్ నుంచి గురుగ్రామ్, పల్వాల్, ఫరీదాబాద్, ఇతర జిల్లాలకు హింస విస్తరించగా, ఇద్దరు హోంగార్డులు, ఒక మసీదు మతాధికారి సహా ఆరుగురు మరణించారు.
అల్లరి ముకలు అనేక వాహనాలు, హోటళ్లు, దుకాణాలకు నిప్పు పెట్టారు.
హర్యానా
100కిపైగా ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసిన పోలీసులు
నుహ్‌లో జరిగే మతపరమైన ఊరేగింపుకు గోసంరక్షకుడు మోను మనేసర్ హాజరవుతారనే పుకార్లు జిల్లాలో మత ఘర్షణలకు దారితీశాయి.
నుహ్ మతపరమైన ఊరేగింపుకు తాను హాజరవుతున్నట్లు పేర్కొంటూ, పెద్ద సంఖ్యలో బయటకు రావాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చిన వీడియోను మానేసర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు సమాచారం.
ఘర్షణల్లో మనేసర్ పాత్రపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
హింసాకాండకు సంబంధించి 390 మందికి పైగా అరెస్టు చేశామని, 118 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే 100కిపైగా ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు.