Indian Migrants: అమెరికా నుంచి వచ్చిన అక్రమ వలసదారుల్లో.. ఇంటర్‌పోల్ వాంటెడ్ నేరగాడు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన వలసదారుల్లో 104 మంది భారతీయులను ఇటీవల ప్రత్యేక విమానంలో భారత్‌కు పంపించారు.
అయితే, ఈ వలసదారుల్లో ఒకరి పేరు ఇంటర్‌పోల్ నేరగాళ్ల జాబితాలో ఉన్నట్టు సమాచారం.
ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల జాతీయ మీడియా నివేదికలు వెలువరించాయి. దీనిపై స్థానిక దర్యాప్తు సంస్థలు విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది.
అమెరికా నుంచి 104 మంది అక్రమ వలసదారులతో బయల్దేరిన సీ-17 విమానం బుధవారం మధ్యాహ్నం పంజాబ్‌లోని అమృత్‌సర్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది.
విమానం చేరుకున్న వెంటనే అధికారులు వలసదారుల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఎటువంటి నేర చరిత్ర లేని వారిని అవసరమైన తనిఖీల అనంతరం వారి స్వస్థలాలకు పంపించారు.
వివరాలు
ఇంటర్‌పోల్ వాంటెడ్ లిస్ట్‌లో వ్యక్తిపై ఇటలీలో కేసు
అయితే, కేసులు ఎదుర్కొంటున్న వారిని మాత్రం తదుపరి విచారణ కోసం ఒక నిర్బంధ కేంద్రానికి తరలించినట్టు తెలుస్తోంది.
దర్యాప్తు అధికారుల పరిశీలనలో ఒక వ్యక్తి పేరు ఇంటర్‌పోల్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నట్టు గుర్తించారు.
అతనిపై ఇటలీలో కేసు నమోదై ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ కేసును సంబంధిత దర్యాప్తు సంస్థలు ప్రస్తుతం ఆరా తీస్తున్నట్లు సమాచారం.
ఆ వలసదారుడిపై ఏ చర్యలు తీసుకోవాలనే అంశాన్ని విచారణాధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు.
వివరాలు
వలసదారుల కొత్త చట్టాలకు కేంద్ర ప్రభుత్వం కృషి
అక్రమ వలసదారులను చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులతో బంధించి తరలించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ నిన్న పార్లమెంట్‌లో మాట్లాడుతూ, వలసదారుల పట్ల అనాగరికంగా వ్యవహరించకుండా ఉండేందుకు అమెరికాతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు.
అంతేకాక, ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లే భారతీయులు సురక్షితంగా, చట్టబద్ధంగా జీవించేందుకు కొత్త చట్టాలను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు.