
Bomb Threat: 48 గంటలలోపు 10 విమానాలకు బాంబు బెదిరింపు.. దర్యాప్తునకు ఏవియేషన్ బాడీ ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
గత 48గంటల్లో 10విమానాలకు బాంబు బెదిరింపులు రావడం విమాన ప్రయాణాలను గందరగోళంలోకి నెట్టేసింది.
మంగళవారం న్యూఢిల్లీ నుంచి చికాగోకు బయలుదేరిన విమానానికి సైతం బాంబు బెదిరింపు వచ్చిన నేపథ్యంలో,ఆ విమానాన్ని కెనడాలోని ఇకాలూయిట్ విమానాశ్రయానికి మళ్లించాల్సి వచ్చింది.
ఈ విషయంపై సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఉన్నతాధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని తెలిపారు.
అమెరికాకు వెళ్తున్న ఈ విమానంతోపాటు మొత్తం ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు పేర్కొన్నారు.
న్యూఢిల్లీ నుంచి అమెరికా బయలుదేరిన విమానానికి మంగళవారం మధ్యాహ్నం సోషల్ మీడియా వేదికగా బెదిరింపులు వచ్చినట్లు గుర్తుచేశారు.
ఉదయం 3.00 గంటలకు ఢిల్లీ నుంచి చికాగోకు బయలుదేరిన ఈ విమానం కొద్ది సమయానికే బాంబు బెదిరింపు రావడంతో భద్రతా చర్యలతో దాన్ని కెనడాకు మళ్లించినట్లు వెల్లడించారు.
వివరాలు
జైపూర్ నుంచి అయోధ్య వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు
అంతేకాక, సౌదీ అరేబియాలోని డమన్ నుంచి లక్నోకు బయలుదేరిన ఇండిగో విమానానికి సైతం బాంబు బెదిరింపు రావడంతో ఆ విమానాన్ని జైపూర్‌లో అత్యవసరంగా దింపారు.
ప్రయాణికులు, సిబ్బంది భద్రత ప్రధానమైనదని ఇండిగో అధికారులు స్పష్టం చేశారు.
అదే విధంగా జైపూర్ నుంచి అయోధ్య వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి కూడా బాంబు బెదిరింపు రావడంతో, మధ్యాహ్నం 2 గంటలకు అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు.
ఇలాంటి బాంబు బెదిరింపులు సోమవారం కూడా వచ్చినట్లు, అందులో అంతర్జాతీయ విమానాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
ఈ తరహా బెదిరింపులు ఆర్థికంగా నష్టపరిచే అవకాశాలు ఉన్నాయని, దర్యాప్తు కోసం చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
అమెరికాకు వెళ్లాల్సిన విమానం కెనడాకు మళ్లింపు
ఈ విపత్కర సమయంలో భారత్, కెనడా మధ్య మాటల యుద్ధం జరుగుతుందని, నిజ్జర్ హత్య కేసులో భారత రాయబారి వర్మ పేరును కెనడా ప్రస్తావించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయని పేర్కొన్నారు.
భారత్, కెనడా రాయబారులు పరస్పరం దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు ఇచ్చిన వేళ, న్యూఢిల్లీ నుంచి అమెరికాకు వెళ్లాల్సిన విమానం కెనడాకు మళ్లించాల్సి రావడం విశేషం.