
Telangana: సాగర్ ప్రాజెక్టు నిర్వహణను తాత్కాలికంగా నీటిపారుదల శాఖకే అప్పగింత
ఈ వార్తాకథనం ఏంటి
నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆపరేషన్,నిర్వహణ బాధ్యతలు తాత్కాలికంగా నీటిపారుదల శాఖకు అప్పగించారు. ఈవిషయాన్ని కృష్ణా నదీ నిర్వహణ బోర్డు స్పష్టం చేసింది.ఇందులో భాగంగా మంగళవారం ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు బోర్డు ప్రత్యేకంగా లేఖ రాసింది. ఈ ఏడాది వరదకాలం ముగిసే వరకూ ప్రాజెక్టు నిర్వహణను కొనసాగించాల్సిందిగా ఆదేశాలిచ్చినట్లు పేర్కొంది. ఈ ప్రక్రియ కింద డిసెంబరు 31వరకు ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను నీటిపారుదల శాఖ ఇంజినీర్లు చేపట్టనున్నారు. గతసంవత్సరం నవంబరు 30న సాగర్ ప్రాజెక్టు కుడి భాగంలో ఉన్న 13క్రస్ట్ గేట్ల ఆధిపత్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత ఈ విషయమై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య విభేదాలు తలెత్తడంతో,కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని,ప్రాజెక్టు వద్ద సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించింది.
వివరాలు
కుడి హెడ్ రెగ్యులేటర్‌ను నిర్వహిస్తున్న ఏపీ జలవనరుల శాఖ
అప్పటి నుంచి ప్రాజెక్టు నిర్వహణను కృష్ణా నదీ బోర్డు పర్యవేక్షణలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. అయితే ప్రాజెక్టు కుడివైపు ఉన్న హెడ్ రెగ్యులేటర్‌ను మాత్రం ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో,గేట్ల నిర్వహణలో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయని, ప్రస్తుతం వరద సమయం నడుస్తున్న నేపథ్యంలో, ప్రాజెక్టు నిర్వహణతో పాటు సంబంధిత ప్రొటోకాల్స్‌ను అమలు చేయాల్సిన అవసరం ఉందని, అందుకోసం ఎప్పటికప్పుడు సిబ్బంది ప్రాజెక్టు ప్రాంగణానికి వెళ్లేందుకు అనుమతి అవసరమని నీటిపారుదల శాఖ ఈఎన్సీ శ్రీ అంజద్ హుస్సేన్ బోర్డుకు లేఖ రాశారు. ఈ లేఖకు స్పందనగా కృష్ణా బోర్డు 101 మంది అధికారులుకు,69 మంది ఇతర సిబ్బందికి ప్రాజెక్టును సందర్శించేందుకు, నిర్వహణ చర్యలు చేపట్టేందుకు అనుమతులు మంజూరు చేసింది.