తెలంగాణలోనే అతిపెద్ద ప్రాజెక్టు శ్రీరాంసాగర్కు భారీ వరద.. 26 గేట్లు ఎత్తివేత
గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. నిజామాబాద్ జిల్లాలో వర్షాలకు చెరువులు, కుంటలు నిండుకుండలా మారుతున్నాయి. దీంతో పలు చోట్ల మత్తడి దుంకుతున్నాయి. వర్షాల ధాటికి వాగులు వంకలు సైతం పొంగిపొర్లుతున్నాయి. ఊరు వాడ, పల్లె పట్టణం తేడా లేకుండా వర్షాలు దంచికొడుతుండటంతో వరద నీరంతా సమీప ప్రాజెక్టుల్లోకి చేరిపోతోంది. తెలంగాణలోనే అతిపెద్దదైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 2 లక్షల 22 వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో 26 గేట్లను అధికారులు ఎత్తేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 90 టీఎంసీలు ఉంది. ఈ మేరకు వచ్చిన వరద నీటిని అలాగే దిగువకు వదిలేస్తున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాజెక్టుల్లోకి భారీగా చేరుతున్న వరద నీరు
కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్, జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుకుంటోంది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ సింగూరు నుంచి వరద ఉద్ధృతి పెరుగుతున్న కారణంగా రిజర్వాయర్ నిండిపోయింది. జిల్లాలోని మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, పిట్లం మండలాల్లో చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో వాగులు వంకలు పొంగి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో అతి భారీవర్షాలు కురువనున్నాయి. ఈ మేరకు ఐఎండీ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. రైతులు పొలాలకు వెళ్లకుండా ఇంటివద్దే ఉండాలని సూచించింది. మక్క, సోయా, పత్తి పంటలను వరద చుట్టు ముట్టిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.