వైఎస్ కుటుంబం చీలిపోయిందా? వచ్చే ఎన్నికల్లో రెండు వర్గాల మధ్య పోరు తప్పదా?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, వైఎస్ కుటుంబంలో కూడా తీవ్రఅలజడిని రేపుతోంది. వివేక హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో వైఎస్ కుటుంబం నిలువుగా చీలిపోయిందనేది బహిరంగ రహస్యం. గతంలోనే షర్మిల- వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య దూరం పెరిగింది. ఆమె సొంతపార్టీ పెట్టుకొని తెలంగాణలో పోరాడుతున్నారు. విజయమ్మ వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి కూతురుతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నారు. వివేకానందరెడ్డి రెండో పెళ్లిపై అవినాష్‌రెడ్డి ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కుటుంబంలోని కొందరిని నొప్పించాయి. ఇలాంటి పలు సంఘటనలు వైఎస్ కుటుంబంలో వర్గపోరును స్పష్టం చేస్తున్నాయి. రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆ కుటుంబం ఒక్కటిగా ఎలా ఉందో, జగన్ హయాంలో అందుకు విరుద్ధంగా ఉంది.
వైఎస్ కుటుంబంలో విబేధాలు కడప జిల్లా పాలిటిక్స్‌పై ప్రభావం
అయితే వైఎస్ కుటుంబంలో ఈ పరిమాణాలు కేవలం వాళ్లు ఫ్యామిలీకి మాత్రమే సంబంధించినవి కాదనే విషయం గ్రహించాలి. రాష్ట్ర రాజకీయాలను, ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప పాలిటిక్స్‌పై పెను ప్రభావాన్ని చూపుతాయి. వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొటున్న అవినాష్ రెడ్డికి సీఎం జగన్ మద్దుతుగా నిలుస్తున్నారు. ఈ విషయం వివేకానందరెడ్డి వర్గానికి నచ్చడం లేదని ప్రచారం జరుగుతోంది. దీంతో కొన్నాళ్లుగా వైఎస్ వివేక వర్గం జగన్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సునీత చేస్తున్న న్యాయపోరాటానికి వివేక వర్గం పూర్తి సహకారం అందిస్తున్నట్లు సమాచారం. కడప జిల్లాలో ఈ వర్గపోరు భవిష్యత్‌లో సంచలన రాజకీయ పరిణామాలకు నాంది పలకబోతున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.
వైఎస్ భారతి బంధువులు మాత్రమే జగన్ వెంట?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత ఆ కుటుంబంలో సగం మంది జగన్‌కు వ్యతిరేకంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. వైఎస్ భారతి బంధువు అయిన వైఎస్ భాస్కర్ రెడ్డి( అవినాష్ రెడ్డి తండ్రి) తరఫు వారు మాత్రమే జగన్ వెంట ఉన్నట్లు తెలుస్తోంది. ఆఖరికి జగన్ సొంత చెల్లలు కూడా వివేక కూతురు సునీతకే మద్దతు తెలపడం, ఆమెకు అండగా ఉంటానని ప్రకటించడం గమనార్హం. ఇదే సమయంలో వైఎస్ కుటుంబంలోని ఒక వర్గం వేరే రాజకీయ వేదికవైపు వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల తెలుగుదేశం పార్టీ పోస్టర్లలో సునీత ఫొటో కనిపించడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అయితే పోస్టర్లతో తమకు సంబంధం లేదని, అది వైసీపీ పని టీడీపీ ఆరోపిస్తోంది.
2024 ఎన్నికల్లో వైఎస్ ఫ్యామిలీ వర్సెస్ వైఎస్ ఫ్యామిలీ ఉండొచ్చా?
తాజాగా జరుగుతున్న పరిణామాలను పట్టి చూస్తే 2024 ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాల్లో వైఎస్ ఫ్యామిలీ వర్సెస్ వైఎస్ ఫ్యామిలీ అనే విధంగా రాజకీయ పోరు ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. వైఎస్ ఫ్యామిలీలోని ఒక వర్గం మద్దతో పాటు వివేకాకు ఉన్న రాజకీయ అనుచరగణం సపోర్టుతో సునీత వచ్చే ఎన్నికల్లో జగన్‌కు వ్యతిరేకంగా నిలబడుతోందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కడప పార్లమెంట్ స్థానంలో సునీతను నిలబెట్టే అవకాశం ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీగా అవినాష్ రెడ్డిని పక్కన పెట్టి వైఎస్ భారతీని గానీ, మరో బలమైన అభ్యర్థిని గానీ జగన్ నిలబెట్టే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.