
YS Sharmila son YS Raja Reddy : రాజకీయ అరంగేట్రానికి రెడీనా వైఎస్ రాజారెడ్డి..? అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదంతో పొలిటకల్ ఎంట్రీ!
ఈ వార్తాకథనం ఏంటి
దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనవడు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయ ప్రస్థానానికి రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. తాజాగా ఆయన తల్లి వైఎస్ షర్మిలతో కలిసి కర్నూలు ఉల్లి మార్కెట్‌ను సందర్శించారు. అక్కడ రైతులతో మాట్లాడుతూ ఉల్లి ధరలు, సమస్యలు గురించి తెలుసుకున్నారు. ఇంటి వద్ద అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్న అనంతరం మార్కెట్ పర్యటనకు వెళ్ళడం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. దీంతో ఆయన త్వరలో రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నారనే ఊహాగానాలు మరింత బలపడ్డాయి. రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నారని కొద్దికాలంగా చర్చ జరుగుతున్న వైఎస్ రాజారెడ్డి, 1996 డిసెంబర్‌లో షర్మిల-అనిల్ దంపతులకు జన్మించారు.
Details
అమెరికాలోని ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగం
హైదరాబాద్‌లోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో విద్యనభ్యసించిన ఆయన, అమెరికాలోని డాలస్ యూనివర్శిటీలో బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ పూర్తి చేశారు. అనంతరం అమెరికాలోని ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగం కూడా చేశారు. చిన్ననాటి నుంచే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందిన ఆయన, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉండడాన్ని ఇష్టపడతారు. వ్యక్తిగత జీవితంలో గతేడాది అట్లూరి ప్రియతో రాజారెడ్డి వివాహం రాజస్థాన్‌లోని బోధ్‌పుర్ ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆ వేడుకను వైభవంగా నిర్వహించారు.
Details
కాంగ్రెస్ బలోపేతంపై దృష్టి
ప్రస్తుతం వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే క్రమంలో కేంద్ర పార్టీ మార్గదర్శకత్వంలో ముందుకు వెళ్తున్నారు. వచ్చే నాలుగేళ్లలో జరిగే సార్వత్రిక ఎన్నికలపై ఆమె దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే యువత, రైతులు, మధ్య తరగతి ప్రజలను ఆకర్షించేందుకు తన కుమారుడు వైఎస్ రాజారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే రాజారెడ్డి అధికారికంగా రాజకీయాల్లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తారు? ఆయన సేవలను పార్టీ ఏ విధంగా ఉపయోగించుకుంటుంది? అనే విషయాలపై స్పష్టత రావాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.