Allu Arjun: 'నాపై తప్పుడు ఆరోపణలు చేయడం బాధగా ఉంది'.. అల్లు అర్జున్
సంధ్య థియేటర్ వద్ద జరిగిన దురదృష్టకర ఘటనపై ప్రముఖ హీరో అల్లు అర్జున్ స్పందించారు. థియేటర్ తనకు గుడిలాంటిదని, అక్కడ ఇలాంటి ప్రమాదం జరగడం తనను తీవ్రంగా బాధించిందన్నారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. అయితే ఈ ఘటనపై తనపై వచ్చిన ఆరోపణలన్నీ అసత్యమని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, తాను ఎలాంటి ర్యాలీ చేయలేదన్నారు. థియేటర్ సమీపంలో తన కారు ఆగిపోయిందని, కారు ముందుకు కదలడం కష్టంగా ఉన్నప్పుడు, చేయి ఊపుతూ అభిమానులకు శాంతంగా ఉండమని సూచించానని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. తొక్కిసలాట జరిగి ఓ మహిళ మరణించిందని తనకు మరుసటి రోజు వరకూ తెలియదని అల్లు అర్జున్ చెప్పారు.
సీఎం విమర్శలపై అల్లు అర్జున్ అసంతృప్తి
మహిళ చనిపోయిన విషయం తెలిసి, ఆ కుటుంబాన్ని పరామర్శించాలనుకున్నానని, కానీ తనపై కేసు నమోదైనట్టు తెలియగానే తన లీగల్ టీమ్ ఆస్పత్రికి వెళ్లవద్దని సూచించిందన్నారు. ఈ నిర్ణయం తనకు చాలా బాధ కలిగించిందన్నారు. ఘటన తర్వాత బాధిత కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు మెడికల్ సపోర్టు కూడా అందించాలని నిర్ణయించామన్నారు. ఈ తన నాన్నను, దర్శకుడు సుకుమార్ ని కుటుంబాన్ని పరామర్శించమని చెప్పినా, అనుమతులు రాకపోవడంతో అది సాధ్యపడలేదని వెల్లడించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై అల్లు అర్జున్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని, సినిమాల ద్వారా తెలుగు ప్రజల గౌరవం పెంచాలని ప్రయత్నిస్తుంటే, ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరమన్నారు.