Jammu and Kashmir: జమ్ములో భారత సైన్యం, ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్.. నలుగురు జవాన్లు వీరమరణం
జమ్ములోని దోడా ప్రాంతంలో భారత సైన్యం,ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో 1 అధికారి సహా 4 మంది సైనికులు వీరమరణం పొందారు. ఈ ఎన్‌కౌంటర్ నిన్న (జూలై 15) రాత్రి 9 గంటలకు ప్రారంభమైంది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని సైన్యానికి సమాచారం అందింది. దీని తరువాత, జమ్ముకశ్మీర్ పోలీసుల సహకారంతో ఇక్కడ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఈ కాల్పుల్లో 5 మంది సైనికులు తీవ్రంగా గాయపడగా, వారిలో నలుగురు మరణించారు.
ఉగ్రవాద సంస్థ 'కశ్మీర్ టైగర్స్' బాధ్యత వహించింది
ఈ దాడికి 'కశ్మీర్ టైగర్స్' అనే ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించింది. ఈ సంస్థకు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ మద్దతు పలుకుతోంది. జూలై 8న కతువాలో భారత ఆర్మీ కాన్వాయ్‌పై జరిగిన దాడికి కూడా ఇదే సంస్థ బాధ్యత వహించింది. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఇంకా దాగి ఉన్నారని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ సైనికులు ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఎన్‌కౌంటర్ తర్వాత దృశ్యాలు
ఇటీవల అనేక ఉగ్రవాద దాడులు జరిగాయి
ఇటీవలి కాలంలో జమ్మూకశ్మీర్‌లో భారత సైన్యంపై పలు ఉగ్రదాడులు జరిగాయి. జూలై 8న, ఆర్మీ వాహనంపై దాడిలో 5 మంది సైనికులు వీరమరణం పొందారు. దీనికి ముందు, కుల్గామ్‌లోని వివిధ ప్రాంతాలలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 6 మంది ఉగ్రవాదులు మరణించారు, ఇందులో 2 మంది సైనికులు కూడా వీరమరణం పొందారు. మే 4న కూడా ఉగ్రవాదుల దాడిలో ఒక సైనికుడు వీరమరణం పొందాడు. అంతకుముందు జూన్ 26న దోడాలోనే ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
జమ్మూలో ఉగ్రవాదం పెరిగిపోతోంది
జమ్మూలో చాలా ఏళ్లుగా ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిందని, అయితే ఇటీవలి కాలంలో ఇక్కడ తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కువయ్యాయి. ఎన్‌డిటివి ప్రకారం, గత 32 నెలల్లో జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడుల కారణంగా 48 మంది భారత ఆర్మీ సైనికులు మరణించారు. అడవుల్లో పోరాడడంలో నిష్ణాతులైన కనీసం 60 మంది ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో చురుకుగా ఉన్నట్లు నివేదికలు ఉన్నాయి.